ఒమన్
వికీపీడియా నుండి
سلطنة عُمان
సుల్తనత్ ఆఫ్ ఒమన్
|
||||||
---|---|---|---|---|---|---|
|
||||||
జాతీయగీతం నషీద్ అస్-సలామ్ అస్-సుల్తానీ |
||||||
రాజధాని (మరియు అతిపెద్ద నగరం) |
మస్కట్ |
|||||
అధికార భాషలు | అరబిక్ | |||||
ప్రభుత్వం | సంపూర్ణ్ణ రాజరిక వ్యవస్థ | |||||
- | సుల్తాన్ | కాబూస్ బిన్ సైయద్ అల్ సయిద్ | ||||
స్వతంత్ర దేశం | ||||||
- | పోర్చుగీస్ వారిని వెడలగొట్టడం | 1650 | ||||
విస్తీర్ణం | ||||||
- | మొత్తం | 3,100,000 కి.మీ² (70వ స్థానం) 119,498 చ.మై |
||||
- | జలాలు (%) | చాలా తక్కువ | ||||
జనాభా | ||||||
- | జూలై 2005 అంచనా | 2,567,0001 (140వ స్థానం) | ||||
- | 2000 జన గణన | 2000 | ||||
- | జన సాంద్రత | 8.3 /కి.మీ² (211వ స్థానం) 21.5 /చ.మై |
||||
జీడీపీ (PPP) | 2005 అంచనా | |||||
- | మొత్తం | $40.923 బిలియన్ (85వ స్థానం) | ||||
- | తలసరి | $16,862 (41వ స్థానం) | ||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2003) | 0.781 (medium) (71వ స్థానం) | |||||
కరెన్సీ | ఒమని రియాల్ (OMR ) |
|||||
టైం జోన్ | -- (UTC+4) | |||||
- | వేసవి (DST) | (UTC+4) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .om | |||||
కాలింగ్ కోడ్ | +968 | |||||
1 జనాభా - షుమారు 577,293 విదేశీయులతో కలిపి |
సుల్తనత్ ఆఫ్ ఒమన్ (Sultanate of Oman) (అరబ్బీ భాషలో:سلطنة عُمان ) నైఋతి ఆసియాలో అరేబియా సముద్రము తీరాన ఉన్న దేశము. దీనికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, యెమెన్ దేశాలతో సరిహద్దులున్నాయి. ముసందమ్ అనే ఒక చిన్నభాగం ప్రధానభూభాగానికి విడిగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోనికి చొచ్చుకొని అరేబియా సముద్రము తీరాన ఉన్నది.
ఒమన్ జనాభా 25 లక్షల పైచిలుకు (ఇందులో దాదాపు 24 శాతం విదేశీయులు). దేశం వైశాల్యం 3,12,000 చ.కి.మీ. (పోలిక కోసం -హైదరాబాదు నగర జనాభా 36 లక్షలు - చుట్టు ప్రక్కల ప్రాంతాలతో కలిపి 61 లక్షలు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైశాల్యం 2,75,068 చ.కి.మీ. అంటే ఒమన్ దేశం వైశాల్యం ఆంధ్ర ప్రదేశ్ కంటే ఎక్కువ. కాని జనాభా హైదరాబాదు నగరం జనాభా కంటే చాలా తక్కువ.)
విషయ సూచిక |
[మార్చు] భౌగోళికం
ఒమన్ మధ్యభాగం చాలావరకు విశాలమైన ఎడారి. తీర ప్రాంతంలో వందల కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న పర్వత శ్రేణులు ఉన్నాయి.'జబల్ అఖ్దర్' 'జబల్ షామ్స్' అనేవి వీటిలో ఎత్తైన భాగాలు. ఈ పర్వత శ్రేణులకు, తీరానికి మధ్యలో ముఖ్యమైన నగరాలు (మస్కట్, సలాలా, సూర్ వంటివి) ఉన్నాయి. 'అల్ హజర్' అనబడే పర్వత శ్రేణులు 'దఖిలియా'ను 'బాతినా' తీరంనుండి వేరు చేస్తున్నాయి. బాతినా తీరం సారవంతమైన మైదాన ప్రాంతం. ఖర్జూరం, కూరగాయల పంటలకూ, పశువుల పెంపకానికీ బాతినా ప్రాంతం అనువైనది.
'రుబ్ అల్‌ఖలి' (అంటే ఖాళీ ప్రదేశం) అనే సువిశాలమైన ఎడారి ఒమన్ పశ్చిమ భాగాన ఉత్తరం నుండి దక్షిణం వరకు విస్తరించి ఉంది.
దక్షిణాన 'ధోఫార్' ప్రాంతం ఋతుపవన ప్రదేశం. ఇక్కడ దట్టమైన చెట్లు ఉంటాయి.
మానవజాతి పుట్టినిళ్ళు (Cradle of Humanity) గా గుర్తించబడిన 15 దేశాలలో ఒమన్ ఒకటి.
[మార్చు] ముఖ్యమైన గణాంకాలు
2003 జనాభా లెక్కల ప్రకారం ఒమన్ ప్రధాన గణాంకాలు ఇలా ఉన్నాయి [1]
- వైశాల్యం 309,500 చ.కి.మీ.
- తీర రేఖ పొడవు షుమఅరు 3,165 కి.మీ.
- జనాభా 2,340,815 (ఒమని పౌరులు, విదేశీ పౌరులు కలిపి)
- జనాభాలో ఒమని పౌరులు 1,781,558
- జనాభాలో విదేశీ పౌరుల శాతం 23.9%
- ఒమని పౌరుల జనసంఖ్య వృద్ధి రేటు 2.0 %
- స్త్రీ - పురుష నిష్పత్తి - ప్రతి 100 మంది ఆడువారికి 102.2 మంది మగవారు
- సగటు జీవిత ప్రమాణఁ 73.78 సంవత్సరాలు
- స్థూల జాతీయ ఆదాయం 7.81 బిలియన్ ఒమని రియాల్స్
- ప్రధానమైన జాతీయ వనరులు పెట్రోలియమ్, సహజ వాయువు, రాగి, వ్యవసాయం, చేపలు పట్టడం
- కరెన్సీ ఒమని రియాల్ - ఒక రియాల్‌కు 2.6008 అమెరికా డాలర్‌లు
- సమయం: గ్రీన్విచ్ సమయానికి 4 గంటలు కలపాలి
[మార్చు] చరిత్ర
ఒకప్పుడు ఒమన్ సుమేరియన్ భాషాపదమైన మాగన్ అనే పేరుతో పిలువబడేది. తూర్పు పర్షియా సామ్రాజ్యంలో ఒక అనుబంధ రాజ్యంగా ఇది ఉండేది. సుమారు క్రీ.పూ.563లో ఈ ప్రాంతం పర్షియా సామ్రాజ్యంలో కలుపబడింది. తదనంతరం క్రీ.శ. 3వ శతాబ్దంనుండి సస్సానియన్ సామ్రాజ్యంలో భాగంగా ఉంది. క్రీ.శ. 1వ శతాబ్దంనుండి అరబ్బులు ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు. క్రీ.శ.632లో సస్సానిడ్‌లు అధికారం కోల్పోయారు. అప్పటినుండి ఒమన్ అరబ్బుల అధీనంలో ఉంది.
క్రీ.శ.751లో ఇబాదీ ముస్లిములు ఒమన్‌లో ఒక ఇమామత్ (మత వ్యవహారాలలో నాయకుడిగా ఒక ఇమామ్ వ్యవహరించే విధానం) నెలకొలిపారు. 20వ శతాబ్దపు మధ్యకాలం వరకు ఈ ప్రాంతంలో వారి నాయకత్వం కొనసాగింది.
పురాతనకాలం నుండీ ఒమన్ ఒక ముఖ్యమైన వర్తక కేంద్రం. 1508లో మస్కట్ నౌకాశ్రయాన్ని పోర్చుగీసువారు ఆక్రమించారు. కాని 1650లో స్థానికులు వాళ్ళను వెళ్ళగొట్టారు. 1659లో ఒట్టొమన్ సామ్రాజ్యం ఒమన్‌ను ఆక్రమించింది. 1741లో వారిని ఓడించి సుల్తాన్ అహ్మద్ బిన్ సయిద్ రాజ్యపాలన ప్రాంభించాడు. అప్పటినుండి ఇప్పటివరకూ అదే సుల్తానుల వంశపాలన సాగుతున్నది. మధ్యలో (1743 నుంది 1746 వరకు) కొద్దికాలం ఒమన్‌ను పర్షియా ఆక్రమించింది.
19వ శతాబ్దం ఆరంభంలో "మస్కాట్ మరియు ఒమన్" (అప్పటి పేరు) బలమైన స్థానిక రాజ్యంగా అభివృద్ధి చెందింది. అప్పట్లో బెలూచిస్తాన్ (ప్రస్తుతం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులలోనున్న ప్రాంతం) మరియు జాంజిబార్ (ఆఫ్రికా తీరంలో ఉన్న ప్రాంతం) కూడా ఒమన్ అధినంలో ఉండేవి కాని క్రమంగా ఆ ప్రాంతాలు వేరు పడ్డాయి. చివరగా 1958లో గ్వదర్ ప్రాంతం పాకిస్తాన్‌కు అమ్మబడింది. 1891లో "మస్కట్ మరియు ఒమన్" యునైటెడ్ కింగ్‌డమ్ రక్షిత దేశంగా అయ్యింది. ఈ విధానం 1971 వరకు కొనసాగింది.
దానికి ఒక సంవత్సరం ముందు, అనగా 1970లో తన తండ్రి "సయ్యిద్ బిన్ తైమూర్"ను అధికారంనుండి తొలగించి ప్రస్తుత పాలకుడు సుల్తాన్ బిన్ సయ్యిద్ అస్ సయ్యిద్ అధికారంలోకి వచ్చాడు. అప్పటినుండి ఒమన్ ఆర్ధిక, సామాజిక రంగాలలో గణనీయమైన అభివృద్ధి సాధించింది. అన్ని పొరుగు రాజ్యాలతోను శాంతియుతంగా ఉండడం, గల్ఫ్ దేశాల మండలిలో భాగంగా ఉండడం, ఉన్న ఆర్ధిక వనరులను ఉపయోగించుకోవడం, విద్య, ఆరోగ్య రంగాలపై శ్రద్ధ వహించడం, స్త్రీలకు అన్ని రంగాలలోను అవకాశాలు ఇవ్వడం ఈ కాలంలో చోటు చేసుకొన్న ప్రధాన విధానాలు.
[మార్చు] పరిపాలన
ఒమన్ పాలకుడు వారసత్వంగా వచ్చే సుల్తాను. ఈయన అన్ని పరిపాలనాధికారాలు కలిగి ఉంటాడు. పాలనా నిర్వహణకు సుల్తానుకు సలహాలిచ్చే 25 మంది సభ్యులుగల మంత్రి మండలి నియమితమౌతుంది. 1990లో "మజ్లిస్ అస్-షూరా" అనే సలహా సంఘాన్ని పరిమితమైన వోటు విధానం ద్వారా ఎన్నుకొన్నారు. 1996లో సుల్తాన్ ప్రకటించిన రాజశాసనం కొన్ని కీలకమైన పాలనాప్రక్రియలకు మూలాధారం. వారసత్వం విషయంలో ఉన్న అనిశ్చితిని తొలగించారు. పరిమిత చట్ట హక్కులు గల రెండు సభల సలహా సంఘం ఏర్పడింది. ఒమన్ పౌరులకు ప్రాధమిక పౌరహక్కుల హామీ ఇచ్చారు.
ఒమన్‌కు ప్రత్యేకంగా రాజ్యాంగమంటూ లేదు. వివిధ రాజాజ్ఞలే పరిపాలనకు మౌలిక విధానాలు. అలాగే రాజకీయ పార్టీలు కూడా లేవు. ఒక్కొక్క 'విలాయత్'కు సుల్తానుచే నియమింపబడ్డ ఒక్కొక్క 'వాలీ' ఉంటాడు. ఇతను స్థానిక పరిపాలనకు బాధ్యుడు.
2003లో ప్రప్రధమంగా "మజ్లిస్ అస్-షూరా"ను సార్వజనిక వోటు విధానం ద్వారా ఎన్నుకొన్నారు. మొత్తం జనాభాలో 74% వరకు (190,000 మంది) తమ వోటు హక్కును వినియోగించుకొన్నారు. ఎన్నికైన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.
[మార్చు] పాలనా విభాగాలు
పాలనాపరంగాను, కొంతవరకు భౌగోళికంగాను ఒమన్ను 5 ప్రాంతాలు ("మింతకా"లు) గాను, మూడు గవర్నరేట్‌లు గాను విభజించారు. ఒక్కో ప్రాంతం మరికొన్ని "విలాయత్"లు (జిల్లాల వంటివి)గా విభజింపబడింది.
[మార్చు] గవర్నరేట్‌లు
[మార్చు] మస్కట్
దేశ రాజధాని నగరము, దాని చుట్టుప్రక్క ప్రాంతాలు కలిపి మస్కట్ గవర్నరేట్. ఇందులో ఉన్న జిల్లాలు:
- మస్కట్-ముత్రా: మస్కాట్-ముత్రా ప్రాంతము చాలాకాలంనుండి రాజ్యపాలనా కేంద్రము. రాజనివాసము. పాత బస్తీ అంటారు. ఇప్పటికీ దివాన్, తదితర ఆఫీసులు ఇక్కడే ఉన్నాయి. నౌకాశ్రయం కూడా ముత్రాలో ఉంది. మస్కట్ ఒక దుర్బేద్యమైన కోటలాంటి బస్తీ. అన్నిప్రక్కలా కొండలతో సురక్షితమై ఉంటుంది. ఒకటే గేటు.
- రువి: రువి, వాడి-కబీర్‌లు ప్రధానమైన వ్యాపార కేంద్రాలు. వాడి కబీర్‌లో వర్క్ షాపులు ఎక్కువ ఉన్నాయి.
- బౌషర్: బౌషర్ లో అల్‌ఖువైర్, ఘుబ్రా, ఘాలా, మదినాత్ సుల్తాన్ కాబూస్ వంటి ఇటీవల బాగా అభివృద్ధి చెందిన నివాస స్థానాలు ఉన్నాయి. ప్రధానంగా ముఖ్య ప్రభుత్వ కార్యాలయాలు, విదేశీ రాయబార కార్యాలయాలు బౌషర్‌లోనే ఉన్నాయి.
- సీబ్: ఒమన్ అంతర్జాతీయ విమానాశ్రయం సీబ్‌లో ఉంది.
- కురియాత్: కురియాత్ ఊరి వెలుపల ఉన్న మత్స్యకారుల గ్రామం. ఇటీవల ఇక్కడ టూరిజమ్ బాగా అభివృద్ధి చెందుతున్నది.
- అమరాత్: కురియాత్ వెళ్ళే దారిలో ఉన్న చిన్న చిన్న గ్రామాల ప్రాంతం.
[మార్చు] ధోఫార్
దక్షిణపు కొనలో ఉన్న ధోఫార్ ప్రాంతం ఋతుపవన ప్రాంతము. ఇక్కడ సలాలా ప్రధాన నగరము. దేశంలోని మూడవ పెద్ద నగరము. ఇందులో కొద్దిభాగం దట్టమైన అడవులతో కూడిన పర్వత ప్రాంతము. గల్ఫ్‌లో చాలామంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ప్రతి సంవత్సరం జూలై-ఆగస్ట్ నెలలో జరిగే 'సలాలా మాన్సూన్ ఫెస్టివల్' ఒక ముఖ్యమైన ఆకర్షణ. సలాలా నుండి రాజధాని మస్కట్‌కు షుమారు 1000 కి.మీ. దూరం. పూర్వకాలంలో ఒంటెల ద్వారా సరకుల రవాణాకు సలాలా-మస్కట్ మార్గం అతి ముఖ్యమైనది. వర్షపాతం బాగా ఉన్నందున చారిత్రకంగా దేశంలో సలాలా ముఖ్యమైన ఆహార ఉత్పత్తి కేంద్రం. సలాలా రేవు కూడా ముఖ్యమైన వ్యాపార కేంద్రం. ఇటీవల ఈ రేవును బాగా అభివృద్ధి చేశారు. పక్కనే యెమెన్ రాజ్యమున్నందున ధోఫార్ ప్రాంతంలో సాంస్కృతికంగా ఆ ప్రభావాన్ని గమనించవచ్చును.
ధోఫార్ ప్రాంతం గురించి చెప్పుకోదగిన మరొక ముఖ్యమైన విషయం 'సాంబ్రాణి చెట్టు' - దీనిని ఆంగ్లంలో Frankincense tree అంటారు. ఇవి ధోఫార్ ఉత్తరాన 'జబల్ అల్‌కరా' అనే పీఠభూమిలో పెరుగుతాయి. తుమ్మచెట్టు లాగానే ఉండే ఈ చెట్టు కాండంనుండి కారే జిగురును 'సాంబ్రాణి' అంటారు. సాంబ్రాణి ఉత్పత్తిలో ఒమన్ ప్రపంచంలోనే ఒక ప్రధాన కేంద్రం.
ధోఫార్ గవర్నరేట్‌లో జిల్లాలు.
- సలాలా
- తుమ్రేత్
- తాగాహ్
- మీర్బత్
- సీదాహ్
- రీఖూత్
- దల్‌ఖూత్
- మగ్సిన్
- షలీమంద్ గుజుర్
- హల్‌నీయత్
[మార్చు] ముసందమ్
ఇది దేశపు ప్రధాన భూభాగంనుండి విడిగా ఉంటుంది. ఉత్తరాన ఉన్న యు.ఎ.ఇ. కి ఒక ప్రక్క. అరేబియా సముద్ర తీరంలో ఉన్న ప్రాంతం. (అంటే ముసందమ్ ప్రాంతం తక్కిన ఒమన్ భూభాగంతో కలిసి లేదు. ముసందమ్ ప్రాంతానికి యు.ఎ.ఇ. భూభాగంతో సరిహద్దు ఉంది.). ఇది Strait of Hormuz సముద్ర సింధుశాఖలోకి చొచ్చుకు వచ్చిన భూభాగం గనుక రక్షణపరంగా కీలకమైనది. ఇది ఆకర్క్షణీయమైన పర్యాటక కేంద్రం. కొద్ది జనాభా ఉన్న చిన్న చిన్న వూళ్ళు ఉన్నాయి. ముసందంలో ఉన్న జిల్లాలు:
- ఖసబ్: ఇది ఒక దీవి.
- బుఖ్‌లా
- దిబ్బా అల్-బేయా
- మధా: ఇది ముసందంకు, తక్కిన ఒమన్‌కు మధ్యలో, యు.ఎ.ఇ. భూభాగం మధ్యలో ఉన్న ఒక చిన్న భాగం. ఇది షార్జా ఎమిరేట్‌లో దుబాయ్ - హత్తా రహదారిపై ఉన్నది. మధా విలాయత్ వైశాల్యం 75 చ.కి.మీ. 1969లో ఈ విలాయత్‌కు సంబంధించిన సరిహద్దు వ్యవహారాలు పరిష్కరింపబడినాయి. మళ్ళీ మధా విలాయత్ మధ్యలో నహ్వా అనే వూరు ఉంది. అది యు.ఎ.ఇ. దేశానికి చెందిన వూరు. దీని వైశాల్యం షుమారు 8 చ.కి.మీ. మొత్తం 40 ఇళ్ళు, ఒక క్లినిక్, ఒక టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ ఉన్నాయి.
[మార్చు] అల్ బురైమి
బురేమి పట్టణం ఇంతకు ముందు ధాహిరాప్రాంతంలో ఒక భాగంగా ఉండేది. అక్టోబరు 2006 నుండి దీనిని ఒక గవర్నరేట్‌గా గుర్తించారు. బురేమి పట్టణం, అల్‌ఐన్ పట్టణం జంట నగరాలు. అంటే ఇవి రెండూ కలిసి ఉంటాయి. కాని బురేమి పట్టణం ఒమన్ దేశంలో ఉంది. అల్‌ఐన్ పట్టణం యు.ఎ.ఇ.లోని అబూధాబి ఎమిరేట్‌క్రిందికి వస్తుంది. పట్టణాలు రెండూ కలిసిపోయినట్లున్నా దేశాలు మాత్రం వేరువేరు.
బురేమి-అల్‌ఐన్ పట్టణాలు ఎడారిలో ఒయాసిస్ స్థానాలు. ఒంటెలు, ఇతర పశువుల పెంపకానికీ, ఖర్జూరం పంటకూ కేంద్రాలు. ఒమన్‌లో ఉన్న విదేశీయులు బురేమీకిగాని, ముసందమ్‌కు గాని వెళ్ళాలంటే ప్రత్యేకంగా అనుమతి తీసుకోవలసి ఉంటుంది.
[మార్చు] ప్రాంతాలు
[మార్చు] అద్ దఖలియా
"దఖిలియా" అంటే లోపలి ప్రాంతము అని అర్ధం. ఇది ఎక్కువగా పర్వతమయమైన ప్రాంతము. ఇక్కడి ప్రదేశాలలో నిజ్వా ముఖ్యమైన పట్టణము. ఒకప్పుడు ఒమన్ దేశానికి నిజ్వా రాజధానిగా ఉండేది. ఈ ప్రాంతం రకరకాలైన ఖర్జూరాల పంటకు ప్రసిద్ధం.
దఖిలియాలోని విలాయత్‌లు
- నిజ్వా
- బిద్-బిద్
- సుమాయిల్
- బహ్లా
- ఇజ్కీ
- అల్‌హమ్రా: ఇది నిజ్వా సమీపంలో ఎత్తైన కొండలపై ఉన్న వూరు. అక్కడ ఉన్న ఒక 'ఫలాజ్' నుండి ఖర్జూరం వ్యవసాయానికి నీరు లభిస్తుంది. అల్ హమ్రా నుండి ఇంకా ఎత్తుకు వెళితే వచ్చే 'జబల్ షామ్స్' అనే ప్రాంతం ఒమన్‌లోకెల్లా ఎత్తైన స్థలం. (సముద్రమట్టం నుండి 3,035 మీ)
- మనా
- అదామ్
[మార్చు] అల్ బాతినా
దేశం తూర్పు తీరాన, మస్కట్ నుండి ఉత్తరాన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వరకు విస్తరించిన బాతినా బాగా విశాలమైన ప్రాంతము. కనుక దీనిని ఉత్తర బాతినా, దక్షిణ బాతినా అని రెండు భాగాలుగా వ్యవహరిస్తారు. బాతినా ప్రాంతం ప్రధానంగా మైదాన భూభాగం. కొండలు లేవు. కాని నీటి వనరులు అత్యల్పం కనుక ఇక్కడ కొద్దిపాటి మెరక వ్యవసాయం భూగర్భ జలాలతో సాగుతుంది. బాతినాలోని విలాయత్‌లు:
- సోహార్: మస్కట్ తరువాత దేశంలో రెండవ పెద్ద పట్టణం. సింద్‌బాద్ అనే నావికుడు బాగ్దాద్ నగరం నుండి అనేక సముద్ర ప్రయాణాలు చేశాడని కధలలో చదువుతాము. కాని అసలు సింద్‌బాద్ సోహార్ నగరానికి చెందినవాడు.
- రుస్తాక్: ఖర్జూర పంటలకు ప్రసిద్ధి. రుస్తాక్ ఊరిలో ఉన్న ఒక వేడినీటి ఊటలో స్నానం ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు.
- షినాస్
- లివా
- సహామ్
- ఖాబురా
- సువెయిక్
- నఖల్
- వాడి అల్-మవల్
- ముసన్నాహ్
- బర్కా
- అల్-అవాబి
[మార్చు] అల్ వూస్తా
ఇది దేశం మధ్యభాగంలో విస్తరించిన ఎడారి భాగం. వందలాదిమైళ్ళ పర్యంతం ఇసుక పర్రలు మాత్రమే కనిపిస్తాయి. అక్కడక్కడా చిన్న చిన్న జనావాసాలలో సంచార జీవులు, ఒంటెల పెంపకందారులు ఉంటారు. వూస్తాలోని విలాయత్‌లు:
- హైమా: ఇది మస్కాట్-సలాలా మార్గం మధ్యలో ఉన్న చిన్న వూరు. మస్కాట్, సలాలాల మధ్య ప్రయాణించే వారికి భోజనానికి, పెట్రోలు నింపుకోవడానికీ తప్పనిసరిగా ఆగవలసిన స్థలం.
- అల్‌దకుమ్:
- అల్‌జజీర్:
- మాహూత్: అరేబియా సముద్ర తీర ప్రాంతలో ఉన్న రేవు పట్టణం. సముద్రం లోపల మసీరా అనే దీవి ఉంది.
[మార్చు] అష్ షర్కియా
షర్కియా ప్రాంతం ప్రధానంగా ఎడారిమయం. తీర ప్రాంతంలోని కొండలూ, గుట్టలూ మిగిలిన ప్రాంతంలో ఎడారి షట్కియా ప్రధాన భౌగోళిక లక్షణం. కొండలకు, ఎడారికి మధ్య ప్రాంతంలో, అక్కడక్కడా నీటివనరులున్నచోట జనావాసాలున్నాయి. ఎడారి ప్రాంతంలో సంచార జాతి ప్రజలు ఎక్కువ. ఒంటెల పెంపకానికి, ఖర్జూరం తోరలకూ షర్కియా పేరు పొందింది. షర్కియాలోని విలాయత్‌లు
- సూర్: ఇది షర్కియాలో అతి పెద్ద పట్టణం, ఓడరేవు. మత్స్యకారులు ఎక్కువగా ఉన్న స్థలం. సూర్‌కు దగ్గరగా 'రాస్ అల్ హద్' అనే సముద్రతీరం సముద్రపు తాబేళ్ళకు రక్షిత స్థానం.
- ఇబ్రా
- బిదియా
- అల్‌కాబిల్
- అల్‌ముదైబి
- దమవల్ తాహిన్
- అల్‌కామిల్
- జాలన్ బని బూ ఆలీ
- జాలన్ బని బూ హసన్
- వాడి బని ఖాలిద్: ఇది కొండలలో బాగా ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఊటనీరు ఏరు ఆధారంగా పెరిగిన వూరు.
- మసీరా: ఇది ఒక దీవి. మాహుత్ నుండి ఇక్కడికి ఫెర్రీలో వెళ్ళవచ్చును.
[మార్చు] అద్ ధాహిరా
ధాహిరా ప్రాంతం ఉత్తర అంతర్భాగాన యు.ఎ.ఇ., సౌదీ అరేబియా దేశాల సరిహద్దులుగా ఉన్న ఎడారి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉన్న విలాయత్‌లు:
- ఇబ్రి: ఈ ప్రాంతంలొ ఇబ్రి పెద్ద పట్టణము.
- మహదా
- యాంకుల్
- దంక్
[మార్చు] జన విస్తరణ
ఒమన్ జనాభాలో అత్యధికులు అరబ్బులు, ముస్లిములు. అధికంగా ఇబాదీ ముస్లింలు. అరబ్బులు కాని ముస్లిములు కూడా ఉన్నారు. వారిలో ముఖ్యమైనవారు
- 'బలూషీ'లు -వీరు ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్‌లలోని బెలూచిస్తాన్ ప్రాంతం నుండి చాలాకాలం క్రితం వలస వచ్చి ఇక్కడ స్థిరపడినవారు. బలూషీ లేదా పుష్టు భాష మాట్లాడుతారు.
- 'జాంజిబారీ'లు - వీరు తూర్పు ఆఫ్రికా ప్రాంతంనుండి వచ్చి స్థిరపడినవారు. వీరు స్వాహిలి భాష మాట్లాడుతారు.
- 'బథారీ' భాష మాట్లాడే వారు ధోఫార్ ప్రాంతంలో ఉన్నారు.
- 'లవాతియా'లు - వీరు భారతదేశం, పాకిస్తాన్ ల మధ్య ఉన్న కచ్ ప్రాంతంనుండి వచ్చిన వారు.
- కొద్దిమంది భారతదేశం నుండి వ్యాపార రీత్యా ఇటీవలికాలంలో వచ్చి స్థిరరపడినవారు కూడా ఉన్నారు. వీరు ముఖ్యంగా గుజరాత్‌కు చెందిన హిందువులు.
2003 జనాభా లెక్కల ప్రకారం ప్రాంతాలవారీగా జనాభా విస్తరణ క్రింది పట్టికలో ఉంది.[2]
ప్రాంతం | మొత్తం
జన సంఖ్య |
శాతం | విదేశీయులు
పౌరులు |
విదేశీయుల
శాతం |
ఒమని పౌరులు | ఒమని పౌరుల
శాతం |
మస్కట్ | 632,073 | 27.0% | 250,461 | 44.8% | 381,612 | 21.4% |
బతినా | 653,505 | 28.0% | 89,098 | 15.9% | 564,407 | 31.7% |
ముసందమ్ | 28,378 | 1.2% | 8,054 | 1.5% | 20,324 | 1.1% |
ధాహిరా | 207,015 | 8.8% | 59,326 | 10.6% | 147,689 | 8.3% |
దఖలియా | 267,140 | 11.4% | 31,803 | 5.7% | 235,337 | 13.2% |
షర్కియా | 313,761 | 13.4% | 49,392 | 8.8% | 264,369 | 14.8% |
వూస్తా | 22,983 | 1.0% | 6,122 | 1.1% | 16,861 | 1.0% |
ధోఫార్ | 215,960 | 9.2% | 65,001 | 11.6% | 150,959 | 8.5% |
మొత్తం దేశం | 2,340,815 | 100.0% | 559,257 | 100.0% | 1,781,558 | 100.0% |
ఒమన్‌లోను, ఇతర గల్ఫ్ దేశాలలోను ప్రస్ఫుటంగా కనిపించే జన విస్తరణాంశం - అధిక సంఖ్యలో విదేశాలనుండి వచ్చి ఇక్కడ పని చేసే కార్మికులు. దాదాపు 24% వరకు ఉన్నారు. వీరిలో ఎక్కువమంది భారతదేశం, పాకిస్తాన్‌కు చెందినవారు. ఇంకా ఫిలిప్పీన్స్, శ్రీలంక, ఈజిప్ట్, సూడాన్, బంగ్లాదేశ్‌లకు చెందినవారు కూడా అధిక సంఖ్యలోనే ఉన్నారు. అన్ని రంగాలలోనూ, అన్ని స్థాయిలలోనూ విదేశీ కార్మికులు పని చేస్తున్నారు. స్థానికుల ఉద్యోగావకాశాలు మెరుగు పరచే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొన్న కొన్ని ముఖ్యమైన చర్యలు:
- కొన్ని రంగాలు (ఉదాహరణకు టాక్సీ సర్వీసు, డ్రైవరు, వాచ్‌మన్ పనులు, సూపర్ మార్కెట్ క్యాషియర్లు) పూర్తిగా 'ఒమనీ' వ్యక్తులకే పరిమితం. వీటిలో విదేశీయులు పనిచేయడం నిషిద్ధం.
- ప్రభుత్వ, ప్రభుత్వరంగ కార్య కలాపాలలో పెద్దయెత్తున 'ఒమనీకరణ' కార్యక్రమం. వీటిలో దాదాపు 90% పైగా ఒమనీకరణ జరిగింది.
- అన్ని కంపెనీలలోనూ కనీస ఒమనీకరణ షరతులు, సంవత్సరం వారీగా ప్రగతి లక్ష్యాలు.
- పెద్దయెత్తున ఒమనీ పౌరులకు విద్య, శిక్షణ అవకాశాలు.
ఈ కార్యక్రమాలన్నీ మంచి ఫలితాలను ఇచ్చాయి. కాని స్థానిక జన సంఖ్య తక్కువ గనుక, వ్యాపార, పారిశ్రామిక రంగాలలో పురోగతి గణనీయంగా ఉన్నందున, ఇంకా విదేశి కార్మికుల సంఖ్య పెద్దశాతంలోనే ఉంది.
[మార్చు] సంస్కృతి
ఒమన్ సంస్కృతిలో ప్రధానంగా కనిపించే అంశాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
ఇది అధికారికంగా మహమ్మదీయ, అరబ్బు సమాజం. కనుక ఇస్లాం మతం ఇక్కడ దైనందిక జీవనంలో ప్రముఖమైన పాత్ర కలిగి ఉంటుంది. ఉదాహరణకు రమదాన్ నెలలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల పని సమయాలను ఉపవాసదీక్షకు అనుగుణంగా మారుస్తారు. అంతే కాకుండా ఒమన్ పౌరులు తమ సంప్రదాయ దుస్తులు ధరించడాన్నీ, అన్ని కట్టడాలూ ఇస్లామిక్ నిర్మాణ సంప్రదాయాలకు అనుగుణంగా ఉండడాన్నీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.
అయితే ఒమన్‌లో ఆధునికత, సంప్రదాయం కలగలిసి ఉంటాయి. తక్కిన కొన్ని గల్ఫ్ అరబ్బు దేశాలకంటే ఒమన్ మరింత స్వేచ్ఛాయుత దృక్పధాన్నీ, పరమత సహనాన్నీ ప్రోత్సహిస్తుంది. ఒమన్‌లో స్త్రీలు అన్ని విధాలైన ఉద్యోగాలలోనూ రాణిస్తున్నారు. ఇక్కడ చర్చిలు, హిందూ దేవాలయాలు ఉన్నాయి. అన్ని మతాల పండుగలు తమతమ పరిధులలో ప్రజలు జరుపుకోవచ్చును. అరబిక్ భాష అధికారిక భాష అయినా ఆంగ్ల భాష విరివిగా వాడుతారు.
ఒమన్ పౌరుల దుస్తులు: మగవారి దుస్తులను 'డిష్‌డాషా' అంటారు. ఇది పైనుంచి క్రిందివరకు వేళ్ళాడే అంగీ. తలపైన సాంప్రదాయిక సందర్భాలలో పాగా, మిగిలిన సమయాలలో టోపీ ధరిస్తారు. నడుముకు బెల్టులాంటి కట్టులో 'ఖంజర్' ధరిస్తారు. ఖంజర్ అంటే ఒకవిధమైన చురకత్తి. ఆడవారు నల్లని దుస్తులు ధరిస్తారు. తలపై జుట్టు కనిపించకుండా కప్పుకుంటారు. గ్రామీణ స్త్రీలు ముఖం కూడా ముసుగులో కప్పుకుంటారు.
[మార్చు] ఆర్ధిక రంగం
ఒమన్ ఆర్ధిక వ్యవస్థ ప్రధానంగా పెట్రోలియమ్ ఉత్పత్తులపై ఆధారపడింది. అయితే చారిత్రకంగా ఒమన్ ఆర్ధిక వ్యవస్థలో ప్రధాన అంశాలైన చేపలు పట్టడం, ఖర్జూర సాగు, వ్యాపారం, గొర్రెలు, ఒంటెల పెంపకం వంటివాటిని ప్రజలు ఏ మాత్రం విడనాడలేదు. గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ ఈ వృత్తులను నిర్వహిస్తున్నారు. అయితే పెట్రోలియమ్ పరిశ్రమ ఇతోధికంగా వృద్ధి చెందడం వలన గ్రామీణ ఉత్పత్తుల శాతం బాగా తగ్గింది.
1956లో జరిగిన పెట్రోలియం అన్వేషణ విఫలమైంది. 1960నాటికల్లా దాదాపు అందరు భాగస్వాములూ అన్వేషణ కార్యక్రమంనుండి విరమించుకొన్నారు. రాయల్ డచ్ షెల్ కంపెనీ తమ కార్యకలాపాలను కొనసాగించింది. 1962లో వారు 'ఫాహుద్' వద్ద మొదటిసారి పెట్రోలియమ్ నిక్షేపాలు కనుగొన్నారు. (ఆ స్థలానికి కేవలం కొన్ని వందల మీటర్ల దూరంలోనే అంతకు ముందు వేసిన బోరు విఫలమైంది!). తరువాత మరి రెండు కంపెనీలు కలిసి పెట్రోలియమ్ డెవలప్‌మెంట్ ఒమన్ స్థాపించారు. అది 1967 జూలై 2 నుండి పెట్రోలియమ్ ఎగుమతులు ప్రారంభించింది. తరువాత ఒమన్‌లో పెట్రోలియమ్, గ్యాస్ అన్వేషణ, తవ్వకం, ఎగుమతులు విజయవంతంగా కొనసాగాయి. 1980 మే 5న రాజ శాసనం ప్రకారం పెట్రోలియమ్ డెవలప్‌మెంట్ ఒమన్ ఒక లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ అయ్యింది.
ప్రస్తుతం ఒమన్ రోజుకు 7,00,000 బ్యారెళ్ళ (1,10,000 ఘనపుటడుగులు) క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి చేస్తున్నది. ఇటీవల సహజవాయువు ఉత్పత్తి, ఎగుమతి కూడా వృద్ధి చెందాయి. మొత్తం దేశం ఎగుమతులలో పెట్రోలియమ్ వాటా 90%. ఒమన్ పెట్రోలియమ్ ఎగుమతి చేసే దేశాల సంఘం, ఒపెక్ (OPEC) లో భాగస్వామి కాదు గాని స్వచ్ఛందంగా వారి ధరకే విక్రయిస్తుంది. ఇలా లభించిన ధనం ఒమన్ అభివృద్ధికీ, సామాజిక సంక్షేమ కార్యక్రమాలకీ పెద్దయెత్తున వినియోగమవుతుంది. 2000 తరువాత పెట్రోలియమ్ ధరలు విపరీతంగా పెరగడంతో మిగిలిన పెట్రోలియమ్ ఉత్పత్తి దేశాల లాగానే ఒమన్ ఆర్ధిక వ్యవస్థ బాగా బలపడింది.
[మార్చు] ఫలాజ్, ఆఫ్లాజ్, వాడి
ఒమన్ నీటివనరులలో ఫలాజ్, వాడి అనేవి ముఖ్యమైన పదాలు. (బురేమీ తప్పించి మిగిలిన ప్రాంతాలలో ఒయాసిస్‌లు లేవు). పరిమితమైన నీటి వనరులున్నందున నీటిని జాగ్రత్తగా వాడుకోవలసిన అవుసరాన్ని ఒమని జనులు పూర్వంనుండి గుర్తించారు. అక్కడక్కడా ఉన్న నీటి వూటలను సన్నని కాలువలతో చిలవలు పలవలుగా జనావాస ప్రాంతాలకూ, సంబంధిత వ్యవసాయ క్షేత్రాలకూ మళ్ళిస్తారు. ఇలాంటి ఒక పిల్లకాలువను 'ఫలాజ్' అంటారు. ఈ పదానికి బహువచనం 'అఫ్లాజ్'.
ఇక వర్షాలు పడినపుడు కొండలలో నుండి వచ్చే నీళ్ళు ఉధృతంగా ప్రవహించే ఏరును వాడి అంటారు. (మన వాగు వంటిది ఇది). కురిసిన వర్షాన్ని బట్టి ఈ వాడిలు కొన్ని గంటలనుండి కొన్ని రోజులవరకు ప్రవహిస్తాయి. కాని అవి వచ్చినపుడు (విశాలమైన భూభాగంలో నీటిని అదుపుచేసే చెట్లు, చేమలు లేకపోవడం వలన) చాలా ఉధృతంగా ఉంటాయి. ఎండిపోయిన కాలువ నిముషాలలో పరవళ్ళు తొక్కే వాడిగా మారుతుంది. వాడిలలో మనుషులు, కార్లు కొట్టుకుపోయే సంఘటనలు తరచు జరుగుతుంటాయి.
జనావాసాలన్నీ అఫ్లాజ్ లేదా వాడిల దగ్గరే అభివృద్ధి చెందాయి.
[మార్చు] ఒమన్‌లో భారతీయులు
ఒమన్‌లో షుమారు 350,000 మంది భారతీయులు ఉన్నారు [3]. అంటే మొత్తం 560,000 విదేశీయులలో 60% పైగా భారతీయులే అన్నమాట. వీరు దేశంలో దాదాపు అన్ని ప్రాంతాలనుండీ వచ్చినవారు, అన్ని మతాలకు చెందినవారు ఉన్నారు. కాని కేరళ, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలనుండి వచ్చినవారు అధికంగా ఉన్నారు. గమనించదగిన మరో ముఖ్యమైన విషయమేమంటే భారతీయులు దాదాపు అన్ని రంగాలలోనూ పనిచేస్తున్నారు. సామాన్యమైన (ప్రత్యేక నైపుణ్యం అవుసరం లేని) కూలిపనులు చేసేవారు, సాంకేతిక, వ్యాపార నిపుణులు, డాక్టర్లు, ఇంజినీరులు, దుకాణాలు నడిపేవారు, ఇంటిలో పనిమనుషులుగా పనిచేసే మహిళలు, మేనేజర్లు - ఇలా దాదాపు అన్నిరంగాలలోనూ విస్తరించి ఉన్న భారతీయ పౌరులు ఒమన్ ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధిలో ఒక ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తున్నారు. దేశంలో షుమారు 2000 మంది భారతీయ డాక్టర్లు ఉన్నారని అంచనా.
ఒమన్‌లో 15 భారతీయ స్కూళ్ళు ఉన్నాయి. ఒక్క స్కూలు కేరళ సిలబస్ ప్రకారం నడుస్తుంది. మిగిలినవన్నీ సి.బి.ఎస్.ఇ. (CBSE -Central Board of Secondary Education) సిలబస్‌ను అనుసరిస్తాయి.
15వ శతాబ్దంనుండీ ఒమన్-భారత దేశాల మధ్య వర్తక సంబంధాలున్నాయని చరిత్రకారులు గుర్తించారు. ముందుగా గుజరాత్ (కచ్), సంధ్, ఖోజా (లవాతియా) ప్రాంతాలవారు వర్తక వాణిజ్యాలలో ప్రముఖ వర్గంగా ఉండేవారు. హిందూ వర్తక సంఘం (బనియా)వాఱు ఇక్కడ 'హిందూ మహాజన్ సంఘం' గా గుర్తించబడ్డారు. చిరకాలంనుండి ఉన్న కుటుంబంవారు 8 తరాలనుండి ఇక్కడే ఉన్నట్లు పేర్కొన్నారు. భారతీయులలో హిందువులకోసం మస్కట్‌లో రెండు హిందూ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో శివాలయం 100 ఏండ్ల కంటే పురాతనమైనదని అంటారు. కంపెనీ క్యాంపు ప్రాంతాలలో గురుద్వారా, అమ్మవారి మందిరం వంటి ప్రార్ధనా సదుపాయాలున్నాయి. 1996 డిసెంబరులో అమలుచేయబడ్డ దేశపు మౌలిక న్యాయ చట్టం ద్వారా ఎవరైనా స్వేచ్ఛగా ప్రార్ధన చేసుకొనే సదుపాయం కల్పించారు.
[మార్చు] మూలాలు
- ↑ http://www.omancensus.net/english/aboutoman.asp
- ↑ http://www.omancensus.net/english/final_results.asp
- ↑ http://www.indemb-oman.org/indo_oman_community.shtml
[మార్చు] బయటి లంకెలు
- ఓపెన్ డైరెక్టరీ ప్రాజెక్టు - ఒమన్ డైరెక్టరీ వర్గం
- Yahoo! - ఒమన్ డైరెక్టరీ వర్గం
|
|
---|---|
ఆఫ్ఘనిస్తాన్ · ఆర్మేనియా · అజెర్బైజాన్1 · బహ్రయిన్ · బంగ్లాదేశ్ · భూటాన్ · బ్రూనై · కంబోడియా · చైనా · తూర్పు తైమూర్ · సైప్రస్1 · జార్జియా1 · భారత దేశము · ఇండొనేషియా · ఇరాన్ · ఇరాక్ · ఇస్రాయెల్ · జపాన్ · జోర్డాన్ · కజకస్తాన్1 · దక్షిణ కొరియా · ఉత్తర కొరియా · కువైట్ · కిర్గిజిస్తాన్ · లావోస్ · లెబనాన్ · మలేషియా · మాల్దీవులు · మంగోలియా · మయన్మార్ · నేపాల్ · ఒమన్ · పాకిస్తాన్ · ఫిలిప్పీన్స్ · కతర్ · రష్యా1 · సౌదీఅరేబియా · సింగపూర్ · శ్రీలంక · సిరియా · తజికిస్తాన్ · తైవాన్ · థాయిలాండ్ · టర్కీ1 · టుర్క్‌మెనిస్తాన్ · యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ · ఉజ్బెకిస్తాన్ · వియత్నాం · యెమెన్1 1 ఐరోపా, ఆసియా - రెండు ఖండాలలోనూ విస్తరించిన దేశం. |