జీవావరణ శాస్త్రము
వికీపీడియా నుండి
జీవులకు పరిసరాలకు మధ్యన ఉండే సంపూర్ణ సంబంధ వ్యూహనము- జీవావరణ శాస్త్రము (Ecology). గ్రీకు భాషలో oikos అనగా ఇల్లు లేదా ఆవాసం logy అనగా శాస్త్రం లేదా అధ్యయనం అని అర్ధం. వృక్షజాతి, జంతుజాతి, మానవులు, సూక్ష్మజీవుల గురించి, అవి నివసించే ఆవాసాలు - భూమి, గాలి, మంచినీటి, సాగర జీవావరణ వ్యవస్థలు - వాటిలో శక్తి ప్రసరణ, పదార్ధ వలయాలు, సజీవ, నిర్జీవ పదార్ధాల మధ్య ఉండే పరస్పర చర్య మొదలైనవన్నీ ఈ శాస్త్ర పరిధిలోకి వస్తాయి. కొంతకాలం క్రితం వరకు దీనిని 'పరిసర జీవశాస్త్రం '(Environmental Biology) గా పరిగణించేవారు.
భూగోళాన్ని ఆవరించుకొని జీవానికి ఆధారం కల్పించే పలుచని మండలాన్ని జీవగోళం (Biosphere) అంటారు.
విషయ సూచిక |
[మార్చు] జీవకారకాలు
ఒక జీవావరణ వ్యవస్థలో నివసించే అన్ని జీవులను "జీవకారకాలు" అంటారు. ఈ జీవులు ఉపయోగించే, నిలువచేసే లేదా విడుదల చేసే పద్ధతులను బట్టి మూడు పోషణ స్థాయిలలో, ఆహార స్థాయిలో విభజించారు.
[మార్చు] ఉత్పత్తిదారులు
జీవావరణ వ్యవస్థ పనిచేయడానికి కావలసిన ప్రధాన శక్తికి మూలాధారం సూర్యుడు. ఆకుపచ్చని మొక్కలు, వృక్ష ప్లవకాలు సూర్యుని నుంచి వచ్చే కాంతిని ఉపయోగించి రసాయన శక్తిగా మారుస్తాయి. ఇవి కిరణజన్య సంయోగక్రియ ద్వారా కాంతిలోని వికరణ శక్తిని, కార్బన్ డయాక్సైడ్, నీరు, ఖనిజ పదార్ధాలను వాడుకొని పిండిపదార్థాలు తయారుచేస్తాయి. అందువల్ల వీనిని ఉత్పత్తిదారులు లేదా స్వయం పోషకాలు అంటారు. మొక్కలు శక్తిని నిలువ ఉంచిన వాటి భాగాలు జంతువులకు (శాఖాహారులు), ఆహారానికి, శక్తికి మూలాధారాలు. అందువల్ల ఉత్పత్తిదారులు ఆహారగొలుసు (Food chain) లో మొదటి పోషణ స్థాయిలో ఉన్నాయి.
[మార్చు] వినియోగదారులు
జంతువులు ఆహారం కోసం ప్రత్యక్షంగా గాని లేదా పరోక్షంగా గాని ఉత్పత్తిదారులపై ఆధారపడి ఉంటాయి. అందువల్ల వీటిని వినియోగదారులు అంటారు. వినియోగదారుల వివిధ పోషణ స్థాయిని బట్టి ప్రాథమిక, ద్వితీయ, తృతీయ వినియోగదారులుగా విభజించారు.
- ప్రాథమిక వినియోగదారులు: స్వయంపోషకాలను ప్రత్యక్షంగా తినే జంతువులను ప్రాధమిక వినియోగదారులు లేదా మొదటి తరగతి వినియోగదారులు అంటారు. వీటిని శాఖాహారులు అని కూడా అంటారు. భౌమ జంతువులైన ఆవులు, జింకలు, కుందేళ్ళు, మిడుతలు మొదలైనవి, జలవాతావరణంలోని ప్రోటోజోవన్లు, క్రస్టేషియన్లు, మొలస్కా జీవులు శాఖాహారులు. సూక్ష్మజీవులైన జంతు ప్లవకాలు కూడా ప్రాధమిక వినియోగదారులే. ప్రాథమిక వినియోగదారులు పర్యావరణ వ్యవస్థలో రెండవ స్థాయిలో ఉంటాయి.
- ద్వితీయ వినియోగదారులు : ప్రాధమిక వినియోగదారులను తినే జంతువులను ద్వితీయ వినియోగదారులు లేదా ప్రాథమిక మాంసాహారులు అంటారు. ఇవి తృతీయ పోషణ స్థాయిని ఆక్రమిస్తాయి. కప్పలు, కుక్కలు, నక్కలు, తోడేళ్ళు, చేపలు మొదలైనవి వీటికి ఉదాహరణలు.
- తృతీయ వినియోగదారులు : ద్వితీయ వినియోగదారులను భుజించే జంతువులను తృతీయ వినియోగదారులు లేదా ద్వితీయ మాంసాహారులు అంటారు. ఉదాహరణ: గద్దలు, డేగలు, సింహాలు, పులులు, కొన్ని పెద్ద చేపలు.
[మార్చు] విచ్ఛిన్నకారులు
జీవుల వ్యర్థ పదార్ధాలు, చనిపోయిన జీవుల కళేబరాలు ఇతర జీవులకు శక్తిగా, పోషక పదార్థాలుగా ఉపయోగపడతాయి. ఇవి జీవావరణలో కోల్పోవు. ఇలాంటి జీవులు విచ్ఛిన్నకారులు ముఖ్యంగా సూక్ష్మజీవులైన బాక్టీరియాలు, శిలీంద్రాలు. వీటిని సూక్ష్మ వినియోగదారులు లేదా పూతికాహారులు అంటారు. జీవావరణ వ్యవస్థలో విచ్ఛిన్నకారులు ముఖ్య పాత్రను పోషిస్తాయి. మృతదేహాల కిష్టమైన పదార్ధాలను ఇవి మామూలుగా వాడుకోగల సరళ రసాయన పదార్ధాలుగా మారుస్తాయి. ఈ విధంగా వీటిని తిరిగి ఉత్పత్తిదారులకు అందేటట్లు చేస్తాయి. విచ్ఛిన్నకారులు లేకపోతే స్వయంపోషకాలు బ్రతకలేవు.
[మార్చు] శాఖలు
- ఆవాస జీవావరణ శాస్త్రం (Habitat Ecology) :
- నిత్యత్వ జీవావరణ శాస్త్రం (Conservation Ecology) :
- ఉత్పత్తి జీవావరణ శాస్త్రం (Production Ecology) :
- జనాభా జీవావరణ శాస్త్రం (Population Ecology) :
- సమాజ జీవావరణ శాస్త్రం (Community Ecology) :
- మానవ జీవావరణ శాస్త్రం (Human Ecology) :
- పురాజీవ జీవావరణ శాస్త్రం (Palaeo Ecology) :
- కాలుష్య జీవావరణ శాస్త్రం (Pollution Ecology) :