Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
వైరస్ - వికీపీడియా

వైరస్

వికీపీడియా నుండి

వైరస్‌లు
హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ - 1 (హెచ్. ఎస్. వి. -1)
హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ - 1 (హెచ్. ఎస్. వి. -1)
శాస్త్రీయ వర్గీకరణ
Groups
I: dsDNA viruses
II: ssDNA viruses
III: dsRNA viruses
IV: positive-sense ssRNA virus
V: negative-sense ssRNA virus
VI: ssRNA-RT viruses
VII: dsDNA-RT viruses

వైరస్ అనే పదము లాటిన్ భాష నుండి ఉద్భవించింది. లాటిన్‌లో వైరస్ అంటే టాక్సిన్ లేదా విషము అని అర్థం. వైరస్‌లు అతి సూక్షమైనవి (సుమారుగా 15-600 నానోమీటర్లు). ఇవి ఇతర జీవుల కణాలపై దాడిచేసి వ్యాధులను కలుగజేస్తాయి. ఈ దాడి ముఖ్య ఉద్దేశ్యము వైరస్‌ల సంతతిని పెంచుకోవడముతో ముడిపడి ఉంటుంది. వైరస్‌లు వాటంతట అవి విభజన చెందలేవు. విభజన చెందాలంటే వేరే జీవకణం తప్పనిసరి. వైరస్‌లలో అతి సరళమైన జన్యుపదార్థం ఒక రక్షణ కవచంచే సంరక్షించబడుతూ ఉంటుంది. ఈ రక్షణ కవచం ప్రోటీనులతో చేయబడి ఉంటుంది, దీనిని క్యాప్సిడ్ అంటారు. వైరస్‌లు చాలా రకాల జీవులపై దాడి చేయగలవు (బాక్టీరియా, జంతురాజ్యము, వృక్షరాజ్యంతో పాటు శిలీంధ్రాలు, ప్రొటిస్టా కి చెందిన జీవులు కూడా వీటి దాడికి గురవుతుంటాయి). బాక్టీరియాపై దాడిచేసే వైరస్‌ను బాక్టీరియోఫేజ్ (సరళత కొరకు ఫేజ్) అని అంటారు. వైరస్‌ల అధ్యయనాన్ని వైరాలజీ అని, వీటిని అధ్యయనం చేసే వారిని వైరాలజిస్టులని అంటారు[1] .

విషయ సూచిక

[మార్చు] వైరస్‌ల చరిత్ర

వైరస్‌ల వల్ల వచ్చే వివిధ రకాల వ్యాధులు మానవజాతిని తరతరాలుగా పీడిస్తూ వచ్చాయి. వీటిలో ముఖ్యమైనవి ఎయిడ్స్, ఆటలమ్మ, మశూచి, తట్టు, పోలియో, యెల్లో ఫేవర్, రేబీస్ వంటివి. ప్రాచీన ఈజిప్టు రాజ్యంలో పోలియో ఉన్నట్టు వారి చిత్రాల ద్వారా విశదమవుతుంది. 1717 సంవత్సరములో, ఒట్టోమన్ రాజ్యంలో ప్రజలు ఆటలమ్మకు వ్యతిరేకంగా వారి పిల్లలను వ్యాధి కారకాలకు గురి చెయ్యడాన్ని (ఇనాక్యులేట్), ఒక బ్రిటీష్ రాయబారి భార్య అయిన మేరీ మాంటెగూ అనే ఆవిడ గమనించింది. 18 శతాబ్దాంతంలో ఎడ్వర్డ్ జెన్నర్, సారా నెల్మ్స్ అనే పాలవ్యాపారిని పరీక్షిస్తుండగా ఆవిడకు ఇంతకు ముందు మశూచి (కౌపాక్స్) రావడంవల్ల ఆ తరువాత మశూచి రాలేదని కనిపెట్టాడు. ఆ తర్వాత జెన్నర్ 1879 లో మొట్టమొదటి టీకాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క మశూచి నిర్మూలనోద్యమంలో వాడాడు.

[మార్చు] వైరస్‌లను కనుగొన్న వైనం

19వ శతాబ్దాంతంలో చార్లెస్ చాంబర్లాండ్ పోర్సలీన్ ఫిల్టర్ని కనుగొన్నాడు, దీని ద్వారా అన్ని బాక్టీరియాలను జల్లించడానికి వీలయ్యేది కాని వైరస్‌లు మాత్రం వేరుచేయబడేవి కాదు. దిమిత్రి ఇవనోవ్‌స్కీ ఈ ఫిల్టర్ సహాయంతో టొబాకో మొజాయిక్ వైరస్‌ను అధ్యయనం చేసాడు. పొగాకుల సారాన్ని (ఎక్స్‌ట్రాక్టుని) వడపోసిన తర్వాత కూడా ఆ ఎక్స్‌ట్రాక్టుకు వ్యాధిని ప్రబలింపజేసే గుణం ఉన్నదని ఆయన తన పరిశోధనల ద్వారా తెలియజేసాడు. అదే సమయంలో, వడపోసినా చిక్కని వ్యాధి కారకాలు కొన్ని ఉంటాయని, ఇతర ప్రయోగాల వల్ల బాక్టీరియాలు, వైరస్‌లు వేర్వేరని ఇతర శాస్త్రవేత్తలు నిర్దారించారు. అంతేకాక వైరస్‌లు కూడా బాక్టీరియాల వలె వ్యాధులను కలగజేస్తాయని కనుగొన్నారు. మరికొన్ని ప్రయోగాల తర్వాత వైరస్‌లు బాక్టీరియాల కంటే సూక్ష్మమైనవని నిర్ధారించబడినది. వైరస్ అనే పదాన్ని డచ్ సూక్ష్మజీవశాస్త్రవేత్త (మైక్రోబయాలజిస్ట్) మార్టినస్ బీజెరింక్ ప్రతిపాదించాడు.

[మార్చు] వైరస్‌ల అధ్యయనం

వైరస్‌లు బాక్టీరియాపై దాడి చేయగలవని 20వ శతాబ్ద ప్రారంభంలో ఫ్రెడెరిక్ త్వార్ట్ కనుగొన్నాడు. ఫెలిక్స్ డి'హెరెల్, వైరస్‌ను కలిగిన ప్రిపరేషన్ను పలుచటి కణాలు వర్ధిల్లుతున్న మేట(కల్చర్) కలిగిన అగార్ ప్లేట్ పైన వేయగా, వైరస్‌లు ఉన్న ప్రదేశంలోని కణాలు చనిపోయాయని గుర్తించాడు. చనిపోయిన ప్రదేశాలను లెక్కించి సస్పెన్షన్లో ఉన్న వైరస్‌ల సంఖ్యను లెక్కకట్టాడు. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఆవిష్కరించబడిన తర్వాత మొట్టమొదటి సారిగా వైరస్‌లను చూడగలిగారు. 1935లో వెండెల్ స్టాన్లీ, టొబాకో మొజాయిక్ వైరస్‌ను స్ఫటికీకరించి (క్రిస్టలైజ్), అందులో అత్యధిక శాతం ప్రోటీన్లే (మాంసకృతులే) నని నిర్ధారించాడు. 1939లో మాక్స్ డెల్‌బ్రూక్ మరియు ఇ.ఎల్.ఎల్లిస్ ఒకే దశలో ఫేజ్‌లు ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయని కనుగొన్నారు.

వైరస్‌లను మామూలుగా ఇతర కణాలను కల్చర్ చేసినట్టు చేయడం వీలయ్యేది కాదు అందువల్ల జంతువులపై ఈ వైరస్‌లచే దాడి చేయించేవారు. ఇలాంటి ప్రయోగాలు అప్పటి వైరాలజిస్ట్‌లకు ఎదురైన ఇబ్బందుల్లో ముఖ్యమైనవి. 1931లో ఎర్నెస్ట్ విలియం గుడ్ పాశ్చర్, ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ను పరిపక్వమైన కోడి గుడ్డులో పెంచాడు. కాని అన్ని రకాల వైరస్లు కోడి గుడ్లలో పెరగలేదు, అందువల్ల ఇంకా ఎక్కువ వాడకం కల పద్దతి అవసరం ఏర్పడింది. 1949లో జాన్ ఫ్రాన్క్లిన్ ఎండర్స్, థామస్ హెచ్.వెల్లర్ మరియు ఫ్రెడరిక్ చాప్మన్ రాబిన్స్ కలిసి పోలియో వైరస్‌ను సజీవమయిన జంతు కణాల కల్చర్‌లో పెంచారు. అప్పటి నుంచి వారి పద్దతిలో చిన్నాచితకా మార్పులు చేస్తూ మిగతా వైరస్‌లను కూడా సెల్ కల్చర్‌లలో పెంచడం మొదలయింది.

[మార్చు] ఆవిర్భావము మరియు వైరస్‌లపై కొనసాగుతున్న వివాదం

ఈనాటి వైరస్‌ల అవిర్భావం గురించి అంతగా తెలియదు. వైరస్‌లు అంత బాగా శిలాజీకరణం (ఫాసిలైజేషన్) చెందవు. అందువల్ల పరమాణు జీవసాంకేతికత (మాలిక్యులర్ బయోటెక్నిక్స్) వల్లే వీటి ఆవిర్భావాన్ని అధ్యయనం చేయటానికి వీలవుతుంది. వైరస్‌ల ఆవిర్భావము గురించి ప్రస్తుతానికి రెండు ప్రతిపాదనలు పరిగణనలో ఉన్నాయి.[2]

  • చిన్న వైరస్‌లు అతి కొద్ది జన్యు పదార్థంతో ఉండేవి సజీవుల జన్యుపదార్థం నుండి వచ్చాయని అనుకుంటున్నారు.
  • అధిక జన్యు పదార్థంతో ఉండే వైరస్‌లు (ఉదా.పాక్స్ వైరస్) ఒకప్పుడు చిన్న కణాలుగా ఇతర జీవులలో పరాన్నజీవుల వలె ఉండేవని, తర్వాతి కాలంలో వాటి పరాన్న జీవనానికి అవసరం లేని జన్యువులను కోల్పోయి ఉంటాయని ఒక భావన. రికెట్సియా, క్లమిడియా వంటి బాక్టీరియాలు కూడా ప్రత్యుత్పత్తి కొరకు ఇతర జీవులను ఆశ్రయిస్తాయి.

వైరస్‌లు సజీవులా నిర్జీవులా అనే వాదన ఇంకా కొనసాగుతూనే ఉంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల కోడ్‌లో వీటిని సూక్ష్మజీవులుగా (మైక్రోఆర్గనిజమ్స్‌గా) పరిగణించారు. కాని శాస్త్రజ్ఞులలో వాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. సజీవులకిచ్చిన నిర్వచనం వీటికి ఖచ్చితంగా వర్తించకపోవడంతో చాలామంది వైరాలజిస్ట్‌లు వైరస్‌లు నిర్జీవులనే భావిస్తారు.[3] [4][5]ఉదాహరణకు సజీవులు చలించినట్టు వైరస్‌లు ప్రకృతిలో కలిగే మార్పులకు చలించవు. వైరస్‌లలో, జీవుల్లో ఉండే అతి ప్రాథమిక నిర్మాణమైన కణనిర్మాణం లేదు. దీనికి తోడు ఇవి విభజన చెందినా కూడా వాటంతట అవి మెటబాలిజమ్ చేసుకోలేవు మరియు విభజనకు ఇతర జీవకణాలపై ఆధారపడతాయి. ఇవి జన్యుపదార్థాన్ని కలిగి ఉండడం మరియు ప్రత్యుత్పత్తిని జరుపుకోవడం వైరస్‌లకు ఇతర జీవులకు ఉండే ముఖ్యమైన పోలికలు. కాని ఒక వేళ వైరస్‌లను సజీవులుగా ఒప్పుకుంటే జీవం అన్న మాటకు నిర్వచనం మార్చవలసి రావచ్చు.

[మార్చు] వర్గీకరణ

బాల్టిమోర్ వర్గీకరణ
విభాగము రకము
I dsDNA వైరస్‌లు
II ssDNA వైరస్‌లు
III dsRNA వైరస్‌లు
IV (+)ssRNA వైరస్‌లు
V (-)ssRNA వైరస్‌లు
VI ssRNA-RT వైరస్‌లు
VII dsDNA-RT వైరస్‌లు
ss: single-stranded, ds: double stranded
RT: reverse transcribing

వర్గీకరణ శాస్త్రంలో వైరస్‌ల వర్గీకరణ కొంచెం కష్టమైన పనే. ఎందుకంటే వైరస్‌లు శిలాజీకరణం చెందవు, దీనికి తోడు వైరస్ లు సజీవులా నిర్జీవులా అన్న అనుమానం ఇంకొకటి. ఇవి వర్గీకరణలో ఏ డొమైన్ లోను అమరవు, అందువల్ల వీటిని కుటుంబం నుంచి వర్గీకరించడం మొదలు పెట్టారు. అయినా కాని, అసైటోటా (కణ రహితం) అనే డొమెయిన్ ప్రతిపాదించారు. ఇంకా అన్ని కుటుంబాలు వర్గాలు (ఆర్డర్లు)గా, అన్ని ప్రజాతులు కూడా కుటుంబాలుగా వర్గీకరించబడలేదు. వైరస్‌ల వర్గీకరణకు ఉదాహరణగా, ఆటలమ్మ వైరస్‌ను తీసుకుంటే దీనిని హెర్పిస్‌విరిడే కుటుంబంలోనూ, ఉపకుటుంబం ఆల్ఫాహెర్పిస్‌విరినే మరియు ప్రజాతి వారిసెల్లో వైరస్‌గా వర్గీకరించారుగాని ఇంకా దీనిని ఏ వర్గంలోనూ చేర్చలేదు. వర్గీకరణ సాధారణంగా క్రింద చూపించిన విధంగా ఉంటుంది.

వర్గం (ఆర్డర్)(ఉదా-విరేల్స్)
కుటుంబం (ఫ్యామిలి)(ఉదా-విరిడే)
ఉప కుటుంబం (సబ్ ఫ్యామిలి)(ఉదా-విరినే)
ప్రజాతి (జీనస్)(ఉదా-వైరస్)
జాతి (స్పీసీస్)(ఉదా-వైరస్)

అంతర్జాతీయ వైరస్‌ల వర్గీకరణ కమిటీ (The International Committee on Taxonomy of Viruses (ICTV)) ఇప్పుడు వాడుకలో ఉన్న వర్గీకరణను తయారు చేసింది. దీనితో పాటు ఎలా వర్గీకరించాలో వివరించే కొన్ని ప్రామాణికాలను కూడా తయారుచేసింది. వర్గాన్ని నిర్ధారించేటప్పుడు వైరస్‌లో ఉన్న జన్యుపదార్థం ఎటువంటిదో, కేంద్రక ఆమ్లము సింగిల్ స్ట్రాండెడ్ లేదా డబల్ స్ట్రాండెడ్, ఎన్వలప్ ఉండడం, లేకపోవడం వంటి విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం. ఈ మూడు ముఖ్యమైన విషయాల నిర్ధారణ తర్వాత మిగతా విషయాలైన అథిది (హోస్ట్), కాప్సిడ్ ఆకృతి, ఇమ్యునొలాజికల్ ప్రాపర్టీస్ మరియు వ్యాధి లాంటి విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. ఈ వర్గీకరణ విధానానికి అదనంగా, నోబెల్ బహుమతి గ్రహీత అయిన డేవిడ్ బాల్టిమోర్, బాల్టిమోర్ వర్గీకరణ విధానాన్ని ప్రతిపాదించాడు. ఈ వర్గీకరణ ప్రకారం వైరస్‌లు వాటి విభజన పద్ధతి మరియు జన్యుపదార్థాన్ని అధారంగా చేసుకొని 7 గ్రూపులుగా విభజంచబడ్డాయి. ఆధునిక వర్గీకరణలో ICTV పద్దతితో పాటు బాల్టిమోర్ వర్గీకరణ విధానాన్ని ఉపయోగిస్తున్నారు.

[మార్చు] నిర్మాణము

A. త్వచ రహిత వైరస్, B. త్వచాన్ని కలిగిన వైరస్. 1.కాప్సిడ్, 2. కేంద్రక ఆమ్లము, 3. కాప్సోమర్, 4. న్యూక్లియోకాప్సోమర్, 5. విరియన్, 6. త్వచము (ఎన్వలప్), 7. స్పైక్. పైన చూపబడిన బొమ్మల్లో వైరస్ లు ఐకొసహెడ్రల్ నిర్మాణాన్ని కలిగి ఉన్నాయి.
A. త్వచ రహిత వైరస్, B. త్వచాన్ని కలిగిన వైరస్. 1.కాప్సిడ్, 2. కేంద్రక ఆమ్లము, 3. కాప్సోమర్, 4. న్యూక్లియోకాప్సోమర్, 5. విరియన్, 6. త్వచము (ఎన్వలప్), 7. స్పైక్. పైన చూపబడిన బొమ్మల్లో వైరస్ లు ఐకొసహెడ్రల్ నిర్మాణాన్ని కలిగి ఉన్నాయి.

ఒక పూర్తి వైరస్ కణాన్ని విరియన్ అని అంటారు. విరియన్ ఒక జీన్ ట్రాన్స్‌పోర్టర్‌కన్నా కొద్దిగా పెద్దదిగా ఉండి, ఒక చిన్న కేంద్రక ఆమ్లమూ, దాని చుట్టూ ఒక తొడుగు (కాప్సిడ్)ను కలిగి ఉంటుంది. కాప్సిడ్ మాంసకృతుల (ప్రోటీన్ల)చే నిర్మించబడి ఉంటుంది. ఈ కాప్సిడ్, వైరల్ జీన్ ద్వారా ఎన్‌కోడ్ చేయబడుతుంది. ఈ కాప్సిడ్, వైరస్ యొక్క ఆకారాన్ని, నిర్మాణాన్ని నిర్ధారిస్తుంది. ఒక్కోసారి ఈ వైరల్ జీన్ ద్వారా ఎన్‌కోడ్ చేయబడిన ప్రోటీన్ ఉపవిభాగాలను ప్రోటోమర్స్ అని అంటారు. ఈ ప్రోటోమర్లు అన్నీ కలిసి ఒక్కోసారి కాప్సిడ్ ను తయారు చేస్తాయి [2]. జన్యుపదార్థానికి సంబందించిన ప్రోటీన్లను కేంద్రక ప్రోటీన్లని (న్యూక్లియో ప్రోటీన్లు అని) అంటారు. వైరల్ కాప్సిడ్ ప్రోటీన్లు మరియు వైరల్ జన్యు పదార్థ అనుసంధానాన్ని న్యూక్లియో కాప్సిడ్ అని అంటారు. నిర్మాణాన్ని బట్టి వైరస్‌లు 4 రకాలు.

చిత్రం హెలికల్ వైరస్‌లు
టొబాకొ మొజాయిక్ వైరస్ ఊహా చిత్రం
టొబాకొ మొజాయిక్ వైరస్ ఊహా చిత్రం
హెలికల్ కాప్సిడ్లు మధ్యలో ఒక అక్షం చుట్టూ ఒకే ఒక ఉపవిభాగాన్ని హెలికల్‌గా కలిగి ఉంటాయి. దీనివల్ల మధ్యలో ఖాళీతో ఒక బోలు గొట్టం తయారవుతుంది. ఇలాంటి అమరిక వల్ల రాడ్ ఆకారంలో ఉండే ఫిలమెంటస్ విరియన్లు తయారవుతాయి. ఇవి పొట్టిగాను, గట్టిగా ఉండే రకం నుండి పొడవుగా ఫ్లెక్సిబుల్‌గా ఉండే రకాల వరకు ఉంటాయి. వీటిల్లో ఉండే జన్యు పదార్థం సాధారణంగా ఒకే పోచను కలిగిన ఆర్.ఎన్.ఎ. కాని కొన్ని సార్లు కొన్ని ఫేజ్ లలో ఒకే పోచను కలిగిన డి.ఎన్.ఎ. కూడా ఉండవచ్చు. వీటిల్లో హెలికల్ కాప్సిడ్ పొడవు సాధారణంగా జన్యు పదార్థం పొడవుపైనా, వెడల్పు- ప్రోటోమర్ల అమరిక పైనా ఆధారపడి ఉంటాయి. టొబాకో మొజాయిక్ వైరస్ ఇలాంటి వైరస్‌లకు మంచి ఉదాహరణ.
చిత్రం ఐకొసహెడ్రల్ వైరస్‌లు
ఐకొసహెడ్రల్ వైరస్ ఎలక్ట్రాన్ మైక్రోగ్రాఫ్
ఐకొసహెడ్రల్ వైరస్ ఎలక్ట్రాన్ మైక్రోగ్రాఫ్
ఐకొసహెడ్రల్ కాప్సిడ్ లు తక్కువ మాగ్నిఫికేషన్ లో ఒక బంతి ఆకారాన్ని పోలి ఉంటాయి, కాని ఇవి నిజానికి సాకర్ బంతి వలె కాప్సోమర్ల అమరిక వల్ల ఒక నిర్దిష్టమయిన ఆకారాన్ని పొందుతాయి. కాప్సోమర్లు అనగా ఉంగరం ఆకారంలో ఉండే 5-6 ప్రోటోమర్ల అమరిక. ఈ ప్రోటోమర్లు నాన్-కోవాలెంట్ బంధంతో దగ్గరవుతాయి. కాని ఈ బంధం హెలికల్ కాప్సిడ్ ల బంధంకన్నా బలహీనమయిన బంధం. ఇలాంటి ఒక బంతి ఆకారంలో ఉండే వైరస్ కాప్సిడ్ తయారవడానికి కావలసిన ప్రోటోమర్ల సంఖ్యను T-సంఖ్య అంటారు .[6] ఇందులో 60×t ప్రోటీన్లు అవసరమవుతాయి. హెపటైటిస్ బి వైరస్ లో T-సంఖ్య 4, కాబట్టి 240 ప్రోటీన్లు చేరి కాప్సిడ్ ను తయారు చేస్తాయి.
చిత్రం తొడుగు కలిగిన వైరస్‌లు (ఎన్వలప్డ్ వైరస్ లు)
ఎయిడ్స్ వైరస్ ఊహా చిత్రం
ఎయిడ్స్ వైరస్ ఊహా చిత్రం
చాలా వైరస్లు ప్రోటీన్ కాప్సిడ్ తో పాటు మార్పులు చేయబడిన కణత్వచం (సెల్ మెంబ్రేన్)లాంటి ఇంకో తొడుగును కలిగి ఉంటాయి. ఈ తొడుగు దాడి చేయబడిన కణం యొక్క బయటి త్వచం (అవుటర్ మెంబ్రేన్) అయినా కావచ్చు, లేదా కేంద్రక త్వచం (న్యూక్లియర్ మొంబ్రేన్) కాని ఎండోప్లాస్మిక్ రెటికులం యొక్క త్వచం వంటి అంతర్గత త్వచమయినా అయి ఉండవచ్చు. ఇలాంటి తొడుగును వైరల్ ఎన్వలప్ అని పిలుస్తారు. ఈ ఎన్వలప్ లో వైరల్ జన్యువు నుండి మరియు హోస్ట్ జన్యువు నుండి కోడ్ చేయబడిన ప్రోటీన్లు ఉంటాయి. ఒకవేళ లిపిడ్ మెంబ్రేన్ గాని కార్బోహైడ్రేట్ మెంబ్రేన్ గాని ఉంటే అది పూర్తిగా హోస్ట్ సెల్ నుండి సంక్రమించినదే అయి ఉంటుంది. ఇన్ ఫ్లూయెంజా వైరస్ మరియు ఎయిడ్స్ వైరస్ లు ఈ రకమైన వైరస్ లకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. వైరల్ ఎన్వెలప్ వల్ల వైరస్ లకు ఎంజైమ్ ల నుండి మరియు కొన్ని రకాల రసాయన పదార్థాల నుండి రక్షణ కలుగుతుంది. ఈ ఎన్వలప్ లో ఉండే ప్రోటీన్లు రిసెప్టార్లు గా గుర్తించి వైరస్ లు ఇతర కణాలను ఆక్రమించడానికి దోహదడుతుంది.
చిత్రం క్లిష్ట నిర్మాణం కలిగిన వైరస్‌లు (కాంప్లెక్స్ వైరస్లు)
బాక్టీరియోఫేజ్ ఊహా చిత్రం
బాక్టీరియోఫేజ్ ఊహా చిత్రం
ఈ వైరస్‌లు అటు హెలికల్‌గానూ ఇటు ఐకొసహెడ్రల్‌గాను లేని కాప్సిడ్‌ను కలిగి ఉంటాయి. ఇవి మిగతా వైరస్‌లలో లేని ప్రోటీన్ తోకలు (టెయిల్స్) లేదా క్లిష్టమయిన బయటి గోడ (ఔటర్ వాల్)ను కలిగి ఉంటాయి. కొన్ని ఫేజ్‌లలో ఐకొసహెడ్రల్ తలకు అనుసంధానించబడిన హెలికల్ తోక ఉంటుంది. పాక్స్ వైరస్‌లు చాలా పెద్దగా ఉండి అరుదైన నిర్మాణాలను కలిగి ఉంటాయి. వైరల్ జన్యువు ప్రోటీన్లతోపాటు న్యూక్లియాయిడ్ అనబడే సెంట్రల్ నిర్మాణానికి అతుక్కొని ఉంటుంది.
పరిమాణము
వైరస్ యొక్క పరిమాణము వివిధ ఇతర జీవులతో పోల్చినప్పుడు
వైరస్ యొక్క పరిమాణము వివిధ ఇతర జీవులతో పోల్చినప్పుడు

చాలా వైరస్‌లను మామూలు సూక్ష్మదర్శిని (కాంతిని ఉపయోగించుకునే సూక్ష్మదర్శిని) సాయంతో చూడలేము. చాలా వరకు అధ్యయనం చేయబడిన వైరస్లు 10 నుండి 300 నానో మీటర్ల వెడల్పు కలిగి ఉన్నాయి. మరికొన్ని అతిసూక్ష్మమైన బాక్టీరియా కన్నా కొద్దిగా పెద్దవి. వైరస్‌లను వీక్షించడానికి తరచూ స్కానింగ్ మరియు ట్రాన్స్మిషన్ ఎలక్రాన్ మైక్రోస్కోప్ అనే రెండు రకాల ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లను వాడతారు. పరిమాణంలో గమనించదగ్గ తేడాలున్న 750 నానోమీటర్ల పరిమాణమున్న మిమివైరస్‌ను ఇటీవల కనుగొన్నారు. వీటిలో రికార్డు స్తాయిలో అత్యధికంగా 1000 జీన్లు (కొన్నింటిలో 400 మాత్రమే) 1.2 మెగాబేస్ జతలున్న జన్యువుపై కనుగొనబడ్డాయి. వీటిలోని చాలా జీన్లు ఇతర ప్రోకారియోట్లు మరియు యూకారియోట్లలో కూడా లభిస్తాయి. ఈ వైరస్‌ను కనుగొనడం వల్ల ఎప్పటినుండో జరుగుతున్న చర్చలో వైరస్‌లు సజీవులనే వాదానికి బలం చేకూరింది.

[మార్చు] జన్యువు

వైరస్‌లలో జన్యుపరమైన వైవిధ్యం
ప్రాపర్టీ పారామీటర్
కేంద్రక ఆమ్లము
ఆకృతి
  • దండాకృతి (లినియర్)
  • వృత్తాకార
  • సెగ్మెంటెడ్
స్ట్రాండెడ్ నెస్
  • సింగల్ స్ట్రాండెడ్
  • డబల్ స్ట్రాండెడ్
  • డబల్ స్ట్రాండెడ్ మరియు అక్కడక్కడ సింగల్ స్ట్రాండెడ్
సెన్స్
  • పాజిటివ్ సెన్స్(+)
  • నెగటివ్ సెన్స్(-)
  • ఆంబిసెన్స్(+/-)

వైరస్ జాతులలో ఉండే జన్యువులు మరే ఇతర జీవు(జంతువులు, వృక్షాలు, బాక్టీరియా వంటి)ల్లో లేనంత వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి.

[మార్చు] కేంద్రక ఆమ్లము

వైరస్‌లలో డి.ఎన్.ఎ. గాని ఆర్.ఎన్.ఎ. గాని ఉండవచ్చు. చాలా అరుదుగా ఈ రెండూ కొన్ని వైరస్‌లలో కనిపిస్తాయి. ప్లాంట్ వైరస్‌లలో సాధారణంగా ఒక పోచ కలిగిన అర్.ఎన్.ఎ. (ssRNA) ఉంటుంది, అలాగే ఫేజ్‌లలో రెండు పోచలు కలిగిన డి.ఎన్.ఎ. (dsDNA) ఉంటుంది. కొన్ని వైరస్‌లలో సైటొసీన్‌కు బదులు హైడ్రాక్సీసైటొసీన్ అనే న్యూక్లియోటైడ్ ఉంటుంది.

[మార్చు] ఆకృతి

వైరల్ జన్యువులు వృత్తాకారంలోగాని(ఉదా.పాలియోమా వైరస్) లేదా కడ్డీ ఆకారంలో(లినియర్‌గా)గాని (ఉదా. అడినోవైరస్)ఉంటాయి. జన్యువు ఆకృతికి అందులో ఉండే రకానికి సంబంధం ఏమీ ఉండదు. ఆర్.ఎన్.ఎ. వైరస్‌లలో జన్యువు విడివిడిగా ముక్కలై గాని సెగ్మెంటెడ్‌గా గాని ఉంటుంది. అన్ని డబల్-స్ట్రాండెడ్ ఆర్.ఎన్.ఎ. జన్యువులు మరికొన్ని సింగల్ స్ట్రాండెడ్ ఆర్.ఎన్.ఎ. జన్యువులు సెగ్మెంటెడ్ అయి ఉంటాయి. ప్రతీ సెగ్మెంట్ ఒక్కోరకమైన ప్రోటీన్‌ను తయారుచేస్తుంది. కొన్ని వైరస్‌లలో వ్యాధి కలిగించడానికి కొన్ని సెగ్మెంట్లు మాత్రం సరిపోతాయి (ఉదా. బ్రోమ్ మొజాయిక్ వైరస్).

[మార్చు] జన్యు పరిమాణము

వైరస్‌లలో జాతిని బట్టి జన్యుపరిమాణము మారుతూ ఉంటుంది. అతి చిన్న జన్యువు 4 ప్రోటీన్లను కోడ్ చేయగలిగి, 106 డాల్టన్లు తూగుతుంది. అతి పెద్ద జన్యువు 108 డాల్టన్లు తూగి, వందకు పైగా ప్రోటీన్లను కోడ్ చేయగలుగుతుంది. ఆర్.ఎన్.ఎ. వైరస్‌లు సాధారణంగా డి.ఎన్.ఎ. వైరస్‌ల కంటే తక్కువ పరిమాణంగల జన్యువును కలిగి ఉంటాయి.

[మార్చు] వైరస్ మరియు వ్యాధులు

వైరస్ల వల్ల మనుషుల్లో వచ్చే సాధారణ వ్యాదులలో జలుబు, ఫ్లూ, మశూచి,చికెన్ పాక్స్ ,చికెన్ గున్యా,డెంగూ జ్యరం ముఖ్యమైనవి. ప్రాణాంతకమైన ఎబోలా, ఎయిడ్స్, ఏవియన్ ఫ్లూ, రేబిస్ ,వైరల్ హెపటైటిస్,జపనీస్ ఎన్సెఫలైటిస్ మరియు సార్స్ కూడా వీటి ద్వారానే కలుగుతాయి. వైరస్లకుండే వ్యాధి కలిగించగలిగే లక్షణాన్ని పోల్చుకోవటానికి విరులెన్స్ అనే పదాన్ని వాడతారు. మల్టిపుల్ స్క్లీరోసిస్ వంటి నాడీసంబంధ వ్యాధులకు ఏమయినా వైరస్లు కారకాలా అనేది ప్రస్తుతానికి పరిశోధనలో ఉంది.[7]

వైరస్లు చాలా రకాలుగా వ్యాధులను కలగజేయగలవు. కణాలపై వీటి ప్రభావంవల్ల కణ విచ్ఛేదనం (సెల్ లైసిస్) జరిగి కణాల మరణం సంభవిస్తుంది. బహుకణ జీవుల కణజాలాలపై వైరస్లు దాడి చేసినప్పుడు ఇలా కొన్ని అవసరమయిన కణాలు మరణిస్తే దాని ప్రభావం మొత్తం జీవిపైన కనబడుతుంది. చాలా వైరస్లు అరోగ్యకరమైన సమన్వయాన్ని (హోమియోస్టాసిస్) ను చెడగొట్టి వ్యాధులను కలుగజేస్తాయి, కొన్ని మాత్రం ఎటువంటి హాని కలుగజేయకండా కూడా జీవించగలుగుతాయి. ఉదాహరణగా హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ ను చెప్పుకోవచ్చు, ఇది సాధారణంగా కోల్డ్ సోర్స్ ని కలుగజేస్తుంది, కాని కొన్ని సార్లు సుప్త స్థితిలో ఎటువంటి హాని చేయకుండా ఉండగలదు.

[మార్చు] ఎపిడెమిక్స్

చాలామట్టుకు ప్రాణాంతకమైన వైరస్‌లు ఫైలోవైరిడేలో చేర్చబడ్డాయి. ఫిలోవైరస్‌లనగా ఫిలమెంట్-లాంటి వైరస్‌లని అర్థం. వీటిల్లో వైరల్ హెమరేజిక్ ఫీవర్ కలుగ జేసే వైరస్‌లు ఎబోలా మరియు మార్బర్గ్ వైరస్‌లు ఉన్నాయి. మార్బర్గ్ వైరస్‌ల వల్ల ఏప్రిల్ 2005లో అంగోలా దేశప్రజలు తీవ్రంగా బాధపడ్డారు. అక్టోబరు 2004లో ప్రారంభమయి 2005 వరకు కొనసాగిన ఈ వైరల్ హెమరేజిక్ ఫీవర్ ప్రపంచ చరిత్రలోనే ఇప్పటివరకు వచ్చిన అతి పెద్ద వైరల్ హెమరేజిక్ ఫీవర్ ఎపిడెమిక్.[8] యూరోపియన్ కాలనిస్టుల నుండి నేటివ్ అమెరికన్లకు ప్రబలిన మశూచి చాలా వరకు వారికి తీరని నష్టాన్ని కలుగజేసిందని కొందరి అభిప్రాయం.[9].

[మార్చు] కనుక్కోవడం, శుద్ధి మరియు వ్యాధి నిర్దారణ

ప్రయోగశాలల్లో వైరస్‌లను పెంచడానికి, గుర్తించడానికి చాలా పద్దతులు వాడుకలో ఉన్నాయి. వైరస్‌లను మిగతా కణాలనుండి వేరు చేసేందుకు డిఫరెన్షియల్ సెంట్రిఫ్యుగేషన్, ఐసోపిక్నిక్ సెంట్రిఫ్యుగేషన్ వంటి పద్ధతులను వాడతారు లేదా అమ్మోనియం సల్ఫేట్ గాని ఇథిలీన్ గ్లైకాల్ గాని ఉపయోగించి, ప్రెసిపిటేట్ చేసిన తర్వాత కణ అవశేషాలను ఆర్గానిక్ సాల్వెంట్ల సాయంతో గాని ఎంజైమ్ సాయంతో గాని వేరు చేసి వైరస్ కణాలని పొందుతారు.

వైరస్లను కనుక్కోవడానికి మరియు క్వాంటిఫయ్ చేయడానికి అస్సేలు:

వైరల్ ప్లేక్ అస్సే
వైరల్ ప్లేక్ అస్సే
  • హిమగ్లూటినషన్ అస్సే ద్వారా ఎర్ర రక్త కణాల్ని కలిగిన ద్రావణం (సొల్యూషన్)లో ఎన్ని వైరస్లున్నాయో తెలుసుకోవచ్చు.
  • ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఉపయోగించి నేరుగా లెక్కించడం.
  • ప్లేక్ అస్సేలో ఒక పల్చటి పొరగా అమరిన అతిథి కణాల(హోస్ట్ సెల్ల్స్)ను ఒక కల్చర్ డిష్ లోకి తీసుకొని విరియన్లను దానిమీద పోస్తారు. విరియన్లు ఆ కణాలపై దాడి చేసి వాటిని చంపివేస్తాయి. ఈ ప్రక్రియలో చనిపోయిన కణాల స్థానంలో రంధ్రాలు(ప్లేక్స్) ఏర్పడతాయి. ఈ ప్లేక్స్ ని లెక్కించి ఆ ద్రావణంలో ఎన్ని విరియన్లున్నాయో తెలుసుకుంటారు. ఈ పద్దతి ద్వారా ఖచ్చితంగా ఎన్ని వ్యాధికారక విరియన్లున్నాయో తెలుస్తుంది.

[మార్చు] నివారణ మరియు చికిత్స

వైరస్లు ప్రత్యుత్పత్తి కొరకు జీవుల జన్యు పరికరాలపై ఆధారపడంవల్ల ఆ జీవికి ఎటువంటి హాని కలగకుండా వీటిని నివారించడం కొద్దిగా కష్టమైన పని. ప్రాముఖ్యత పొందిన వైద్యవిధానం ప్రకారం, టీకాల ద్వారా వ్యాధులను నివారించడమే అతి ఉత్తమం.

[మార్చు] చికిత్సల్లో వైరస్‌ల ఉపయోగాలు

వైరోథెరపి అనగా వైరస్‌లను వెక్టర్లుగా వాడుకొని వివిధ వ్యాధులను నయంచేయడము. వైరోథెరపి వల్ల కలిగే ముఖ్యమైన లాభం ఏమిటంటే ఇవి అవసరమయిన కణాలను లేదా డి.ఎన్.ఎ.ను టార్గెట్ చేయగలుగుతాయి. కాన్సర్ జీన్ థెరపీ లో వీటి వాడకం ఎక్కువగా ఉంది. తూర్పు యూరోపియన్ వైద్యులు యాంటీబయొటిక్స్‌కు బదులుగా, ఫేజ్ థెరపిని ఉపయోగించి కొన్ని బాక్టీరీయాలను టార్గెట్ చేసారు. బాక్టీరియాల రెసిస్టన్స్ పెరుగుతున్నందువల్ల ఈ విధానానికి కొంత ప్రాముఖ్యత ఉంది.[10]

[మార్చు] ఇవి కూడా చూడండి

[మార్చు] మూలాలు, వనరులు

  1. http://en.wikipedia.org/w/index.php?title=Virus&oldid=158887186/ ఆంగ్ల వికీలో వైరస్ వ్యాసము
  2. 2.0 2.1 Prescott, L (1993). Microbiology. Wm. C. Brown Publishers. 0-697-01372-3. ఆంగ్ల పుస్తకము
  3. http://school.discovery.com/lessonplans/programs/understandingviruses/ వ్యాసము ఇంగ్లీషులో ఉన్నది
  4. http://www.tulane.edu/~dmsander/garryfavwebfaq.html/ వ్యాసము ఇంగ్లీషులో ఉన్నది
  5. http://library.thinkquest.org/CR0212089/virus.htm/ వ్యాసము ఇంగ్లీషులో ఉన్నది
  6. Virus triangulation numbers via Internet Archive. తీసుకొన్న తేదీ: 2006-04-05.
  7. Chen C, Chiu Y, Wei F, Koong F, Liu H, Shaw C, Hwu H, Hsiao K (1999). "High seroprevalence of Borna virus infection in schizophrenic patients, family members and mental health workers in Taiwan". Mol Psychiatry 4 (1): 33-8. PMID 10089006. 
  8. Marburg outbreak worst recorded. BBC News (2005-03-31). తీసుకొన్న తేదీ: 2007-04-05.
  9. Smallpox epidemic ravages Native Americans on the northwest coast of North America in the 1770s. HistoryLink.org. తీసుకొన్న తేదీ: 2007-04-05.
  10. Matsuzaki S, Rashel M, Uchiyama J, et al (2005). "Bacteriophage therapy: a revitalized therapy against bacterial infectious diseases". J. Infect. Chemother. 11 (5): 211-9. DOI:10.1007/s10156-005-0408-9. PMID 16258815. 
Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com