మధుమేహం
వికీపీడియా నుండి
మధుమేహ చిహ్నం.[1] | ||
ఐ.సీ.డీ-10 (ICD-10) | E10.–E14. | |
ఐ.సీ.డీ-9 (ICD-9) | 250 | |
ICD-O: | ||
OMIM | [1] | |
DiseasesDB | {{{DiseasesDB}}} | |
MedlinePlus | 001214 | |
eMedicine | med/546 emerg/134 | |
MeSH | C18.452.394.750 |
మధుమేహం లేదా చక్కెర వ్యాధిని వైద్య పరిభాషలో డయాబెటిస్ మెల్లిటస్ (మూస:IPAEng or /ˌdaɪəˈbiːtəs/, /məˈlaɪtəs/ or /ˈmɛlətəs/) అని వ్యవహరిస్తారు. డయాబెటిస్ అని కూడా అనబడే ఈ వ్యాధి, ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిసమ్ మరియు రక్తంలో అధిక గ్లుకోస్ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక సిండ్రోమ్ [2]. అతి మూత్రం (పాలీయూరియా), దాహం ఎక్కువగా వేయడం (పాలీడిప్సియా), మందగించిన చూపు, కారణం లేకుండా బరువు తగ్గడం మరియు బద్దకం దీని ముఖ్య లక్షణాలు. మధుమేహం లేదా చక్కెర వ్యాధిని సాధారణంగా రక్తంలో మితి మీరిన చక్కెర స్థాయిని బట్టి గుర్తిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం భారత దేశం, చైనా, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అత్యధికంగా ఈ వ్యాధి ప్రబలి ఉన్నది [3].ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించే మందులు లేవు. జీవితాంతం తగిన జాగ్రత్తలు తీసుకొన్నట్లయితే దీన్ని అదుపులో ఉంచుకోవడం సాధ్యం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన మూడు డయాబెటిస్ మెల్లిటస్ రకాలు: వివిధ రకాల కారణాల వల్ల కలిగే టైప్ 1, టైప్ 2 మరియు జెస్టేషనల్ డయాబెటిస్ (గర్బిణీలలో వచ్చే డయాబెటిస్)[4]. అయినా, అన్ని రకాల డయాబెటిస్‌లకు మూల కారణం క్లోమ గ్రంధిలోని బీటా కణాలు పెరిగిన గ్లూకోస్ స్థాయిని అరికట్టడానికి సరిపడినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోవడమే [5]. టైప్ 1 డయాబెటిస్ సాధారణంగా బీటా కణాలను మన శరీరం స్వయంగా నాశనం చేయడం(ఆటోఇమ్యూనిటీ) వల్ల కలుగుతుంది. టైప్ 2 డయాబెటిస్‌లో ఇన్సులిన్ నిరోధకత వస్తుంది. దీనివల్ల అధికంగా ఇన్సులిన్ కావలసి వస్తుంది, బీటా కణాలు ఈ డిమాండ్ తట్టుకోలేనప్పుడు డయాబెటిస్ కలుగుతుంది. జెస్టేషనల్ డయాబెటిస్‌లో కూడా ఇన్సులిన్ నిరోధకత అగుపిస్తుంది.
జెస్టేషనల్ డయాబెటిస్ సర్వసాధారణంగా ప్రసవం తర్వాత తగ్గిపోతుంది, కానీ టైప్ 1 మరియు టైప్ 2లు మాత్రం దీర్ఘకాలికంగా ఉంటాయి[2]. 1921లో ఇన్సులిన్ అందుబాటులోకి రావడంతో అన్ని రకాలను నియంత్రించడం సాధ్యమయ్యింది. ఆహార అలవాట్ల మార్పు కూడా భాగమయినప్పటికీ, ఇన్సులిన్ ఉత్పత్తి లేని టైప్ 1ను నియంత్రించడానికి తప్పనిసరి మార్గం ఇన్సులిన్ ఇంజెక్షన్. టైప్ 2 ఆహార అలవాట్ల మార్పు మరియు ఆంటీడయాబెటిక్ మందుల వాడకం వల్ల మరియు అప్పుడప్పుడు ఇన్సులిన్ వాడకం వల్ల నియంత్రించవచ్చు. ఇంతకుమునుపు ఇన్సులిన్ పందుల క్లోమాల నుండి తీయబడేది, ప్రస్తుతము చాలా వరకు ఇన్సులిన్ ఉత్పత్తి జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా జరుగుతుంది. ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ వల్ల ఉత్పత్తి చేయబడే ఇన్సులిన్ మానవ ఇన్సులిన్‌కు పూర్తి కాపీగా గాని, వివిధ ఆన్‌సెట్ అఫ్ యాక్షన్ మరియు యాక్షన్ చూపబడే సమయం ఉండే విధంగా తయారుచేయబడుతున్నాయి. ఇన్సులిన్‌ను ఇన్సులిన్ పంపుల ద్వారా నిర్విరామంగా అవసరానికి తగిన విధంగా సరఫరా చేయవచ్చు.
డయాబెటిస్ వల్ల అనేక కాంప్లికేషన్స్ వస్తాయి. త్వరగా మరియు తీవ్రంగా (అక్యూట్) వచ్చే కాంప్లికేషన్స్ హైపోగ్లైసీమియా, కీటో అసిడోసిస్ లేదా నాన్‌కీటోటిక్ హైపర్‌ఆస్మొలార్ కోమా వ్యాధిని సరిగా నియంత్రించుకోకపోతే రావచ్చు. తీవ్రమైన దీర్ఘకాలిక కాంప్లికేషన్స్‌గా హృద్రోగాలు (రెట్టింపు ఆపద), దీర్ఘకాలిక మూత్రపిండాల బలహీనత, రెటీనా చెడిపోవడం (తద్వారా అంధత్వము), నాడీ కణాలు చెడిపోవడం (చాలా రకాలైన), మరియు సూక్షనాళికలు చెడిపోవడం వల్ల కలిగే పురుషత్వ లోపం మరియు గాయాలు త్వరగా మానకపోవడం ముఖ్యమైనవి. గాయాలు సరిగా మానకపోవడం వల్ల ముఖ్యంగా కాళ్ళలో గాంగ్రీన్ రావడం వల్ల ఒక్కోసారి అవిటితనం కూడా రావచ్చు. డయాబెటిస్‌పై సరైన నియంత్రణ, రక్తపోటును అదుపులో ఉంచుకోవడం మరియు దైనందిన విషయాలలో మార్పులు చేసుకోవడం వల్ల (సిగరెట్లు మానివేయడం లాంటివి) మరియు ఆరోగ్యకరమైన బరువును నిలుపుకోవడం చేస్తే పైన చెప్పబడిన చాలా వరకు కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అభివృద్ది చెందిన దేశాలలో యుక్తవయస్కులలో అంధత్వానికి, డయాలిసిస్ అవసరమయ్యే డయాబెటిక్ నెఫ్రోపతికి అతి ప్రాముఖ్యత గల కారణం డయాబెటిస్ [6].
విషయ సూచిక |
[మార్చు] వ్యాధి లక్షణాలు
డయాబెటిస్ లక్షణాలలో సాంప్రదాయిక త్రయంగా పాలీయూరియా (అతిగా మూత్రం రావడం), పాలీడిప్సియా (దాహం వేయడం) మరియు పాలీఫాజియా (అతిగా ఆకలి వేయడం) అను వాటిని చెప్పుతారు. టైప్ 1 డయాబెటిస్‌లో ఈ లక్షణాలు త్వరగా అగుపిస్తాయి (ముఖ్యంగా చిన్న పిల్లలలో). కానీ, టైప్ 2లో మాత్రం చాలా నెమ్మదిగా మొదలవుతాయి, ఒక్కోసారి ఈ లక్షణాలేమీ కనిపించకపోవచ్చు కూడా. టైప్ 1 డయాబెటిస్ వల్ల కొద్ది సమయంలోనే గుర్తించదగిన బరువు తగ్గడం (మామూలుగా తిన్నా, అతిగా తిన్నా కూడా) మరియు అలసట కలుగుతుంటాయి. ఒక్క బరువు తగ్గడం తప్ప మిగతా అన్ని లక్షణాలు, టైప్ 2 డయాబెటిస్ సరిగా నియంత్రణలలో లేని వారిలో కూడా కనిపిస్తాయి. మూత్రపిండాల సామర్థ్యాన్ని దాటి రక్తంలో గ్లుకోస్ నిలువలు పెరిగితే, ప్రాక్సిమల్ టుబ్యూల్ నుండి గ్లూకోస్ రీఅబ్సార్ప్షన్ సరిగా జరగదు, కొంత గ్లూకోస్ మూత్రంలో మిగిలిపోతుంది. దీనివల్ల మూత్రం యొక్క ఆస్మాటిక్ పీడనం పెరిగి నీటి రీఅబ్సార్ప్షన్ ఆగిపోతుంటుంది, దానివల్ల మూత్రవిసర్జన ఎక్కువవుతుంది (పాలీయూరియా). కోల్పోయిన నీటి శాతాన్ని రక్తంలో పునస్థాపించడానికి శరీర కణాలలోని నీరు రక్తంలో చేరుతుంది, దీని వల్ల దాహం పెరుగుతుంది. ఎక్కువ కాలం రక్తంలో అధిక గ్లూకోస్ నిలువలు ఉండడం వల్ల కంటి లెన్స్‌లో గ్లూకోస్ పేరుకుపోయి దృష్టి లోపాలను కలుగజేస్తుంది. చూపు మందగించడం అనేది టైప్ 1 డయాబెటిస్ ఉందేమో అనే అనుమానాన్ని లేవనెత్తడానికి ముఖ్య కారణం.
రోగుల్లో (ముఖ్యంగా టైప్ 1) డయాబెటిక్ కీటో అసిడోసిస్ కూడా ఉండే అవకాశాలున్నాయి. దీనివల్ల మెటబాలిసమ్ నియంత్రణ కోల్పోయి శ్వాశలో అసిటోన్ వాసన రావడం, శ్వాశవేగంగా పీల్చుకోవడం, కడుపులో నొప్పి మొదలగు లక్షణాలు అగుపిస్తాయి. ఈ పరిస్థితి తీవ్రమైతే కోమా తద్వారా మరణం సంభవించవచ్చు. అతి అరుదైనదైనా తీవ్రమైన టైప్ 2 లో కలిగే నాన్ కీటోటిక్ హైపర్ ఆస్మొలార్ కోమా శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం వల్ల కలుగుతుంది.
డయాబెటిస్ మెల్లిటస్
|
---|
డయాబెటిస్‌లో రకాలు |
డయాబెటిస్ మెల్లిటస్ టైప్ 1 డయాబెటిస్ మెల్లిటస్ టైప్ 2 Gestational diabetes Pre-diabetes: |
Disease Management |
Diabetes management: •Diabetic diet •Anti-diabetic drugs •Conventional insulinotherapy •Intensive insulinotherapy |
Other Concerns |
Cardiovascular disease
Diabetic comas: Diabetic myonecrosis Diabetes and pregnancy |
రక్త పరీక్షలు |
Blood sugar Fructosamine Glucose tolerance test Glycosylated hemoglobin |
[మార్చు] రకాలు
మధుమేహము రెండు రకాలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం టైప్ 1 మరియు టైప్ 2 అని రెండు వర్గాలుగా విభజంచబడినది(అమెరికన్ డయాబెటిస్ అస్సోసియేషన్ ప్రకారము కూడా అంతే).సాదారణంగా దీనిని గుర్తించడంలో జాప్యం జరుగుతుంటుంది. ఐతే, ఈ రెండు వ్యాధి లక్షణాలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. ఈ వ్యాధికి చెయ్యవలసిన వైద్యానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ 2000 జూన్ లో కొన్ని ప్రామాణికాలను నిర్ణయించింది.
డయాబెటిస్ అనగానే డయాబెటిస్ మెల్లిటస్ స్పురిస్తుంది. కొన్ని అరుదైన వ్యాధులను కూడా డయాబెటిస్ అంటారు. వాటిల్లో డయాబెటిస్ ఇన్సిపిడస్ ముఖ్యమైనది, మూత్రపిండాలు లేదా పిట్యూటరీ గ్రంధి పాడవడం వల్ల కలిగే, ఈ వ్యాధిలో మూత్రములో తియ్యదనము ఉండదు.
ముఖ్యమైన రెండురకాలైన డయాబెటిస్ మెల్లిటస్ రకాలు టైప్ 1 మరియు టైప్ 2. టైప్ 1 డయాబెటిస్ అనే పదము ఇంతకుముందున్న జువెనైల్-డయాబెటిస్, ఇన్సులిన్ డిపండెంట్ డయాబెటిస్ వంటి పదాలకు ప్రస్తుతం వాడుకలో ఉన్న పదం. అలాగే టైప్ 2 నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ వంటి వాటికి ప్రత్యమ్నాయంగా వాడబడుతుంది.
[మార్చు] టైప్ 1 డయాబెటిస్ మెల్లిటస్
- ప్రధాన వ్యాసం: డయాబెటిస్ మెల్లిటస్ టైప్ 1
టైప్ 1 డయాబెటిస్ మెల్లిటస్, క్లోమ గ్రంధిలోని ఐలెట్స్ ఆఫ్ లాంగర్‌హాన్స్‌లో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే బీటా కణాలు సంఖ్యలో తగ్గిపోవడం లేదా నశించడం వల్ల ఏర్పడే ఇన్సులిన్ కొరత వల్ల కలుగుతుంది. ఆటోఇమ్మ్యూనిటీ వల్ల టి-కణాలు బీటా కణాలపై దాడి చేయడం ముఖ్యకారణం.[5] ప్రస్తుతము తెలిసిన ప్రొఫైలాక్సిస్ ఏమీ లేదు. ఈ వ్యాధి ప్రారంభానికి ముందు ఆరోగ్యంగా ఉండి మంచి బరువును కలిగి ఉంటారు. ఈ వ్యాధి పెద్దలలో గానీ పిల్లలోగాని ఎవరిలోనైనా రావచ్చు. కానీ సాంప్రదాయకంగా చిన్న పిల్లలలో వచ్చే ఈ వ్యాధిని 'జువినైల్ డయాబెటిస్' అని అంటారు. ఈ వ్యాధికి చికిత్స, ప్రారంభదశలోనైనా సరే, జాగ్రత్తగా రక్తంలోని గ్లుకోస్ నిలువలను గ్లుకోమీటర్‌లతో కనిపెట్టుకుంటూ ఇన్సులిన్ వాడడమే. శరీరంలో ఇన్సులిన్ సరిపడినంతగా లేకపోతే డయాబెటిక్ కీటో అసిడోసిస్ ద్వారా కోమా లేదా మరణం సంభవించవచ్చు. చికిత్సా విధానంలో ప్రస్తుతం లైఫ్‌స్టైల్ మార్పులు (ఆహార అలవాట్లు మరియు శారీరక శ్రమ) కూడా చేర్చారు. ఇన్సులిన్‌ను సబ్‌క్యుటేనియస్ ఇంజెక్షన్ల ద్వారానే కాకుండా ఇన్సులిన్ పంపుల ద్వారా కూడా అందించవచ్చు.
[మార్చు] జాగ్రత్తలు
చక్కెరవ్యాధిగ్రస్తులు ఆ జబ్బు గురించి అవగాహన పెంచుకోవాలి. ఇతర రోగులతో కలిసి తమకు తెలిసిన విషయాలను మిగిలిన వారితో పంచుకోవాలి. పాదాలు, మూత్ర పిండాలు, గుండె, నరాలు మొదలైన అవయవాలపై ఈ వ్యాధి ప్రభావం ఎలా ఉంటుందో వీరు తెలుసుకోవాలి.
- రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. తద్వారా శరీరం బరువు పెరగకుండా చూసుకోవాలి.
- భోజనానికి అరగంట ముందు మాత్రలు వేసుకోవాలి. మాత్రలు వేసుకోవడం మాత్రమే కాదు. వాటిని ప్రతిరోజూ సరియైన సమయంలోనే వేసుకోవాలి. సమయ పాలన లేకపోతే మందులు వేసుకుంటున్నా శరీరంలో ఒక అపసవ్య స్థితి ఏర్పడుతుంది.
- ప్రతి రోజూ ఒక నిర్ణీత సమయంలోనే భోజనం చేయాలి.
- ఇన్సులిన్ వేసుకోవడంలోనూ కాల నియమాన్ని పాటించాలి.
- మధుమేహంలో కాళ్లల్లో స్పర్శజ్ఞానం పోయిందన్న విషయం చాలాకాలం వరకు తెలియదు. అందుకే వారు ఏటా ఒకసారి పాదాల్లో స్పర్శ ఎలా ఉందో తెలుసుకోవాలి. స్పర్శ లేకపోతే ప్రతి ఆరుమాసాలకు వీలైతే మూడు మాసాలకు ఒకసారి పరీక్ష చేయించాలి.
- పాదాల మీద చర్మం కందిపోవడం, గాయాలు, పుండ్లు, ఆనెలు ఏమైనా ఉన్నాయేమో గమనించాలి. డాక్టర్ సమక్షంలో అవసరమైన చికిత్స తీసుకోవాలి.
- గోళ్లు తీసే సమయంలో ఎక్కడా గాయం కాకుండా జాగ్రత్త వహించాలి. పాదాలను ప్రతి రోజూ గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి.
- ఇన్‌ఫెక్షన్లతో కాళ్లకు చీము పడితే చాలా తీవ్రమైన విషయంగా పరిగణించాలి. డాక్టర్ సలహాతో యాంటీబయాటిక్స్, అవసరమైతే ఇన్సులిన్ తీసుకోవాలి.
- అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ పరీక్షలు, అలాగే కళ్లు, కిడ్నీ పరీక్షలు కూడా డాక్టర్ సలహా మేరకు చేయించుకోవాలి.
- మధుమేహం ఉన్న వారికి మూత్ర పిండాలు దెబ్బతినే అవకాశం ఉంది. దీనివల్ల మూత్రంలో ఆల్బుమిన్ అనే ప్రొటీన్ విసర్జించబడుతుంది. అంతిమంగా ఇది కిడ్నీ దెబ్బ తినడానికి దారి తీస్తుంది. అందుకే ప్రతి మూడు మాసాలకు, ఆరు మాసాలకు పరీక్ష చేసి మూత్రంలో ఆల్బుమిన్ ఉందా లేదా కనుగొనాలి.
- మధుమేహం ఉన్న వారిలో గుండె కండరాలకు రక్తాన్ని కొనిపోయే కరొనరీ రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం ఉంది. అందుకే గుండె నొప్పి ఉన్నా లేకపోయినా ప్రతి ఏటా ఇసిజి, ట్రెడ్‌మిల్ పరీక్షలు చేయించుకోవడం అవసరం. అలాగే కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తెలిపే లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించాలి.
- ధాన్యాలు, పిండిపదార్థాలు తగ్గించి పీచు పదార్థాలు అధికంగా ఉండే కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.
[మార్చు] మానుకోవలసిన అలవాట్లు
- తీపి పదార్థాలు, ఐస్‌క్రీములు మానుకోవాలి. అతి పరిమితంగా తీసుకున్నప్పుడు అయితే, ఆరోజు మామూలుగా తీసుకునే ఆహార పదార్థాల మోతాదును బాగా తగ్గించాలి. అలాగే నూనె పదార్థాలు కూడా బాగా తగ్గించాలి.
- కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో శరీరంలో చక్కెర శాతం హఠాత్తుగా పెరిగిపోవచ్చు. అప్పుడు మాత్రలు ఆ స్థితిని అదుపు చేయలేకపోవచ్చు. అలాంటప్పుడు డాక్టర్ సూచిస్తే ఇన్సులిన్ తీసుకోవాలి. ఆ తరువాత చక్కెర అదుపులోకి వచ్చాక మళ్లీ మాత్రలకే పరిమితం కావచ్చు. ఒకసారి ఇన్సులిన్ తీసుకుంటే జీవితాంతం ఇన్సులిన్ తీసుకోవలసి వస్తుందన్నది సరికాదు. ఆ కారణంగా ఇన్సులిన్ తీసుకోవడానికి వెనుకాడకూడదు.
- పాదరక్షలు లేకుండా నడవకూడదు.
- పొగతాగడం పూర్తిగా మానుకోవాలి.
- మానసిక ఒత్తిళ్లను తగ్గించుకోవాలి.
- కొలెస్ట్రాల్ అధికంగా ఉండే కొవ్వు ఉన్న మాంసం, గుడ్లు తినడం మానుకోవాలి.
[మార్చు] రిఫరెన్సులు
- ↑ (ఆంగ్లము) IDF Chooses Blue Circle to Represent UN Resolution Campaign. Unite for Diabetes (17 March 2006).
- ↑ 2.0 2.1 (ఆంగ్లము) L M Tierney, S J McPhee, M A Papadakis (2002). Current medical Diagnosis & Treatment. International edition. New York: Lange Medical Books/McGraw-Hill, 1203-1215. ISBN 0-07-137688-7.
- ↑ (ఆంగ్లము) Wild, S (2004). "Global Prevalence of Diabetes". Diabetes Care 27: 1047-1053.
- ↑ (ఆంగ్లము) World Health Organisation Department of Noncommunicable Disease Surveillance (1999). Definition, Diagnosis and Classification of Diabetes Mellitus and its Complications (PDF).
- ↑ 5.0 5.1 (ఆంగ్లము) Rother, KI (2007). "Diabetes Treatment — Bridging the Divide". N Engl J Med 356 (15): 1499-1501.
- ↑ (ఆంగ్లము) Mailloux, Lionel (2007-02-13). [[[:మూస:Cite web /url=http://patients.uptodate.com/topic.asp?file=dialysis/15147 /title=UpToDate Dialysis in diabetic nephropathy /accessdate=2007-12-07 /format= /work=]] UpToDate Dialysis in diabetic nephropathy]. UpToDate. తీసుకొన్న తేదీ: 2007-12-07.