లేజర్
వికీపీడియా నుండి
లేసర్ (LASER) అనేది ఏమిటో తేలిక అయిన తెలుగు మాటలలో చెప్పటం కష్టం. లేసర్ coherent కాంతిపుంజాన్ని ఉత్పత్తి చేసే పరికరం అని చెప్పొచ్చు. Coherent కాంతిపుంజం అంటే ఏమిటి? పొంతన ఉన్న కాంతిపుంజం. ఎవరితో (దేనితో) పొంతన ఉన్న కాంతిపుంజం? తనతోనే! అంటే కాంతిపుంజంలో ఉన్న కాంతి కెరటాలన్నీ ఒకదానితో మరొకటి పొంతన చెంది ఉంటాయి, లేదా coherent గా ఉంటాయి. అంటే కాంతిపుంజంలో ఉన్న కాంతి కెరటాలన్నీ ఒకే తరంగదైర్ఘ్యం (wavelength) కలిగి ఉంటాయి. అంటే కాంతిపుంజంలో ఉన్న కాంతి కెరటాలన్నీ ఒకే ఆవృత్తి (frequency) కలిగి ఉంటాయి. అంటే కాంతిపుంజంలో ఉన్న కాంతి కెరటాలన్నీ ఒకే రంగుతో (color) ఉంటాయి. ఇంకా నిర్దుష్టంగా చెప్పాలంటే లేసర్ కాంతిలో ఉన్న ఫోటానులన్నీ ఒకే దిశ (direction)లో, ఒకే దశ (phase) లో, ఒకే తరంగదైర్ఘ్యంతో, ఒకే తలీకరణతో (polarization) కంపిస్తూ ఉంటాయి. ఇంత జాగ్రత్తగా చెప్పినా ఈ నిర్వచనం కూడ ఆక్షేపణకి గురి అయే సావకాశం ఉంది.
ఈ లేసర్ అనేది 'కసాగు' వంటి ప్రధమాక్షరనామం (acronym). ఈ పదం యొక్క పూర్తి రూపం "Light Amplification by Stimulated Emission of Radiation".
మొదటి లేసరుని 1960 వ సంవత్సరం, మే 16 వ తారీఖున థియోడోర్ మేమన్ అనే వ్యక్తి హ్యూస్ (Hughes) పరిశోధనాశాలలో ప్రదర్శించాడు. ప్రస్తుతము లేసర్లు కోట్ల రూపాయల పరిశ్రమగా అవతరించాయి. లేసర్లు అతి విస్తృతంగా సీ.డీ (CD)లు, డీ.వీ.డీ. (DVD)లు చదవడములోనూ, రాయడములోనూ ఉపయోగపడుతున్నాయి. ఇవి ఇంకా బార్ కోడ్ రీడింగ్ యంత్రాలుగానూ, లేసరు ప్రింటర్లలోనూ, పాయింటర్లలోనూ ఉపయోగపడుతున్నాయి.
లోహాలను కత్తిరించడానికి కూడా లేసర్లను ఉపయోగిస్తారు. శాస్త్ర విజ్ఞానములో లేసర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యముగా స్పెక్ట్రోస్కోపీ అధ్యయనములో లేసర్లకు ఉన్న నిర్దుష్ట తరంగ దైర్ఘ్యం, అతి తక్కువ విరామ కాలము వంటి లక్షణాలు విరివిగా ఉపయోగించబడుతున్నాయి. ఇంకా వైద్యము, సైనికావసరాలు, ఇంజనీరింగ్, అంతరిక్ష విజ్ఞానము, విమానయానము తదితర అనేక రంగాలలో లేసర్ల ఉపయోగము ఉన్నది.