రోహిణి (నటి)
వికీపీడియా నుండి
ఆర్.రోహిణి, దక్షిణ భారత సినిమా నటి. సినీరంగములో బాల్యనటిగా అడుగుపెట్టిన రోహిణి తెలుగు, తమిళం, కన్నడ మరియు మళయాళంలలో అనేక సినిమాలలో బాల్యనటిగా నటించింది. ఆ తర్వాత కొంతకాలము తర్వాత చాలా సినిమాలలో చెల్లెలి పాత్రలు చేసింది. నవమోహిని లాంటి సినిమాలలో గ్లామర్ పాత్రలు పోషించినా, అంతగా విజయవంతము కాలేదు. రోహిణి సినీ నటుడు రఘువరన్ ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నది. కానీ ఈ వివాహబంధము పొసగక వివాహమైన ఏడు సంవత్సరాలకు విడాకులు తీసుకొని విడిపోయినది.
ప్రతిభావంతమైన వ్యక్తి అయిన రోహిణి ఆ తర్వాత సామాజిక సేవ కార్యక్రమాలు మరియు టీవీ కార్యక్రమాలలో నిమగ్నమైనది. చాలా వ్యవధి తర్వాత కమల్ హాసన్ సినిమా పోతురాజు (తమిళంలో విరుమాండి)లో, అయ్యన్ (తమిళం)లో నటించింది. పోతురాజు సినిమాలో ఒక పరిశోధకురాలి పాత్రలో కనిపించింది. 1995లో పాలగుమ్మి పద్మరాజు కథ ఆధారముగా కె.ఎస్.సేతుమాధవన్ నిర్మించిన స్త్రీ సినిమాలో ముఖ్యపాత్రను పోషించిన రోహిణి ప్రత్యేక జ్యూరీ అవార్డు అందుకొన్నది.