రాగం
వికీపీడియా నుండి
భారతీయ సంగీతంలో కొన్ని స్వరాల సమూహము రాగం.
[మార్చు] రాగాలు-రకాలు
ఆరోహణ, అవరోహణలను బట్టి రాగాలను రెండుగా విభజించారు.
[మార్చు] జనక రాగాలు
జనక రాగాలను మేళకర్త రాగాలు, సంపూర్ణ రాగాలు అంటారు. ఇవి 72 ఉన్నాయి. వీటి లక్షణాలు:
- ఆరోహణ, అవరోహణలలో సప్తస్వరాలు ఉంటాయి.
- ఆరోహణ, అవరోహణలోని సప్తస్వరాలు క్రమ పద్ధతిలో వరుస మారకుండా ఉంటాయి.
- ఆరోహణలో ఏఏ అంతర గాంధారాది క్రమం ఉంటే, అవరోహణలో కూడా అదే క్రమం ఉంటుంది.
ఈ 72 జనక రాగాలను రెండు భాగాలుగా విభజించారు. వీటిలో మొదటి 36 రాగాలకు శుద్ధ మధ్యమం ఉన్నందువలన, ఈ పూర్వ మేళ రాగాలను 'శుద్ధ మధ్యమ రాగాలు' అంటారు. తరువాత 36 రాగాలకు ప్రతి మధ్యమం ఉన్నందువలన ఈ ఉత్తర మేళ రాగాలను 'ప్రతి మధ్యమ రాగాలు' అంటారు.
పూర్వ, ప్రతి మధ్యమ రాగాలలో ఒక్కొక్క విభాగాన్ని ఆరు సూక్ష్మ విభాగాలుగా చేసి, 12 భాగాలు ఏర్పరచారు. వీటిని 'చక్రములు' అంటారు. ఒక్కొక్క చక్రంలో ఆరు రాగాలు ఉండేలా విభజన చేశారు. ఈ పన్నెండు చక్రాల పేర్లు:
- 1. ఇందు చక్రం : కనకాంగి, రత్నాంగి, గానమూర్తి, వనస్పతి, మానవతి మరియు తానరూపి రాగాలు.
- 2. నేత్ర చక్రం : సేనాపతి, హనుమతోడి, ధేనుక, నాటకప్రియ, కోకిలప్రియ మరియు రూపవతి రాగాలు.
- 3. అగ్ని చక్రం : గాయకప్రియం, వకుళాభరణం, మాయామాళవగౌళ, చక్రవాకం, సూర్యకాంతం మరియు హాటకాంబరి రాగాలు.
- 4. వేద చక్రం : ఝుంకారధ్వని, నటభైరవి, కీరవాణి, ఖరహరప్రియ, గౌరీమనోహరి మరియు వరుణప్రియ రాగాలు.
- 5. బాణ చక్రం : మారరంజని, చారుకేశి, సరసాంగి, హరికాంభోజి, ధీరశంకరాభరణం మరియు నాగానందిని రాగాలు.
- 6. ఋతు చక్రం : యాగప్రియ, రాగవర్ధిని, గాంగేయభూషిణి, వాగధీశ్వరి, శూలిని మరియు చలనాట రాగాలు.
- 7. ఋషి చక్రం : సాలగం, జలార్ణవం, ఝాలవరాళి, నవనీతం, పావని మరియు రఘుప్రియ రాగాలు.
- 8. వసు చక్రం : గవాంబోధి, భవప్రియ, శుభపంతువరాళి, షడ్వితమార్గిణి, సువర్ణాంగి మరియు దివ్యమణి రాగాలు.
- 9. బ్రహ్మ చక్రం : ధనళాంబరి, నామనారాయణ, కామవర్ధిని, రామప్రియ, గమనశ్రమ మరియు విశ్వంభరి రాగాలు.
- 10. దిశ చక్రం : శ్యామలాంగి, షణ్ముఖప్రియ, సింహేంద్రమధ్యమ, హేమవతి, ధర్మవతి మరియు నీతిమతి రాగాలు.
- 11. రుద్ర చక్రం : కాంతామణి, రిషభప్రియ, లతాంగి, వాచస్పతి, మేచకళ్యాణి మరియు చిత్రాంబరి రాగాలు.
- 12. ఆదిత్య చక్రం : సుచరిత్ర, జ్యోతిస్వరూపిణి, ధాతువర్ధిని, నాసికాభూషణి, కోసలము మరియు రసికప్రియ రాగాలు.
[మార్చు] జన్య రాగాలు
మేళకర్త రాగాల నుండి పుట్టినవి ఈ జన్య రాగాలు. వీటిని స్వరభేదం చేత వివిధ రాగాలుగా విభజించారు.
- ఉపాంగ రాగాలు : ఇది 15వ మేళకర్త రాగమైన మాయామాళవ గౌళ రాగం యొక్క జన్యం. ఉదాహరణ - సావేరి, మలహరి రాగాలు.
- భాషాంగ రాగాలు : ఇది నటభైరవి అనే 20 మేళకర్త రాగం యొక్క జన్యం. ఉదాహరణ - భైరవి, ఆనందభైరవి రాగాలు.
- వర్జ రాగాలు : ఉదాహరణ - శ్రీరంజని, మోహన, శుద్ధ సావేరి రాగాలు.
- వక్ర రాగాలు : రాగంలో స్వరాల అమరిక క్రమ పద్ధతిలో ఉండకపోవడమే వక్ర రాగ లక్షణం. ఉదాహరణ - ఆనంద భైరవి, సారంగ, శహన రాగాలు.
- నిషాదాంత్య రాగాలు : కొన్ని రాగాలు నిషాదంతో అంతమవుతాయి. అటువంటి రాగాలు తారాస్థాయిని చేరుకోవు. ఉదాహరణ - నాదనామ క్రియ రాగం.
- పంచమాంత్య రాగాలు : కొన్ని రాగాలు మధ్యస్థాయి పంచమంతో అంతమవుతాయి. ఉదాహరణ - నవరోజు రాగం.
- దైవతాంత్య రాగాలు : కొన్ని రాగాలు మధ్యస్థాయి దైవతంలో అంతమవుతాయి. ఉదాహరణ - కురంజి రాగం.