బసవేశ్వరుడు
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
బసవేశ్వరుడు (1134–1196) హైందవ మతాన్ని ఉద్దరించిన ప్రముఖులలో ఒకడు. ఈతడిని బసవన్న, బసవుడు అని మరియు విశ్వగురు అని పిలుస్తారు. సమాజంలో కుల వ్వవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది. వీరశైవం ఇతను బోధించిన మార్గం.
కర్ణాటకలోని బాగేవాడి ఇతని జన్మస్థలం. తండ్రి మాదిరాజు, తల్లి మాదాంబ. చిన్న వయసులోనే శైవ పురాణ గాధలను అవగతం చేసుకున్న బసవనికి కర్మకాండపై విశ్వాసం పోయింది. ఉపనయనం చేయ నిశ్చయించిన తల్లిదండ్రులను వదలి కూడలి అనే పుణ్యక్షేత్రం చేరిన బసవుడు అక్కడ వేంచేసియున్న సంగమేశ్వరుణ్ణి నిష్టతో ధ్యానించాడు. శివుడు అతని కలలో కనిపించి అభయమిచ్చాడని, నందీశ్వరుడు పంచాక్షరీ మంత్రం ఉపదేశించాడని చెబుతారు. శివుని ఆనతి మేరకు మంగళవాడ (కళ్యాణ పురం) చేరుకుంటాడు. ఇతడు 12వ శతాబ్దంలో కర్ణాటక దేశాన్ని పాలించిన బిజ్జలుని కొలువులో చిన్న ఉద్యోగిగా చేరి, అతని భాండాగారానికి ప్రధాన అధికారియై భండారీ బసవడుగ ఖ్యాతినొందాడు. సామర్ధ్యమునకు నిజాయితీ తోడుకాగా భక్త భండారి బిజ్జలుని ప్రధానామాత్యుడిగా పదవి అందుకున్నాడు.
ఒక వైపు రాజ్యపాలనలో ప్రధాన భూమిక నిర్వహిస్తూ బసవడు భగవద్భక్తి వ్యాప్తికి నిరంతర కృషి చేశాడు. అతని బోధనలలోని సమదృష్టి పలువురిని ఆకర్షించింది. వీరశైవ మతానికి తిరిగి పట్టం కట్టిన బసవని ఖ్యాతి కర్ణాటక ఎల్లలు దాటి ఆంధ్రదేశంలోను వ్యాప్తి చెందినది. ప్రతిరోజు లక్షా తొంభై ఆరువేల మంది జంగములకు మృష్టాన్నములతో అర్చించి అనంతరం తాను భుజించేవాడట. బసవడు తన ఉపదేశాలు ప్రజలకు అందుబాటులో ఉండే రీతిగా వచనాలు వ్రాసాడు. వీటిలో సూక్ష్మమైన తత్త్వం సులువుగా బోధపడేది. సాహిత్య పరంగా కూడా బసవేశ్వరుని వచనాలకు చక్కని గౌరవం లభించింది. ఇతడు మొత్తం 64 లక్షల వచనాలు కూర్చినట్లు ప్రతీతి. కానీ, ఈనాడు కొన్ని వేలు మాత్రమే మనకు లభ్యమైనాయి.
బసవేశ్వరుడు స్థాపించిన వేదాంత గోష్టికి 'అనుభవ మండపం' అని పేరు. బసవేశవరుడు తన చేతుల మీదుగా ఒక వర్ణాంతర వివాహం జరిపాడు. అది ఆనాటి సంఘంలో తీవ్ర వ్యతిరేకతకు దారి తీసింది. నూతన దంపదుతులు హత్యకు గురౌతారు. ఈ సంఘటన బసవుని హృదయాన్ని కలచివేస్తుంది. తన అమాత్య పదవిని వదలి బసవేశ్వరుడు కూడలి సంగమేశ్వరుని సన్నిధికి చేరి, కొంతకాలానికి ఆయనలో లీనమైపోతాడు.
బసవేశ్వరుడు బోధించిన సంప్రదాయమే అనంతర కాలంలో "లింగాయత ధర్మం"గా స్థిరపడింది.
కాయమే (శరీరం) కైలాసమని చాటి శ్రమ జీవనానికి గౌరవస్థానం కల్పించిన బసవేశ్వరుడు నందీశ్వరుని అవతారంగా భావిస్తారు. బసవేశ్వరుని దివ్య జీవితగాధను పాల్కురికి సోమనాధుడు రచించిన 'బసవ పురాణం' తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధమయింది.
[మార్చు] మూలాలు
- బసవేశ్వరుడు, దక్షిణాది భక్తపారిజాతాలు, యస్.వి.యస్.గ్రాఫిక్స్, హైదరాబాదు, 2003.