బోస్టన్
వికీపీడియా నుండి
బోస్టన్ మహానగరము అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఉన్న మస్సాచుసెట్స్ రాష్ట్ర రాజధాని. న్యూ ఇంగ్లండ్ ప్రాంతంలోకెల్లా అతి పెద్దది అయిన బోస్టన్‌ను ఆ ప్రాంత ఆర్థిక మరియు సాంస్కృతిక కేంద్రంగా పరిగణిస్తారు.[1] 2006వ సంవత్సర జనాభా లెక్కల ప్రకారము ఈ నగర జనాభా దాదాపు 5,96,763. బోస్టన్ నగరంలో నివసించేవారిని 'బోస్టనియన్స్ ' అని పిలుస్తుంటారు.
1630లో ఇంగ్లండ్ నుండి వలస వచ్చిన ప్యూటరిన్లు షాముట్ ద్వీపకల్పంలో ఈ నగరాన్ని నెలకొల్పారు.[2] 18వ శతాబ్దంలో జరిగిన అమెరికా విప్లవానికి సంబంధించిన ఎన్నో ముఖ్య సంఘటనలను ఈ నగరం సాక్షి. అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బోస్టన్ మహానగరం ప్రముఖ నౌకాపోర్టుగా,పరిశ్రమలకు కేంద్రంగా రూపుదిద్దుకుంది.
అమెరికా చరిత్రలో మొట్టమొదటి పబ్లిక్ స్కూలు అయిన బోస్టన్ లాటిన్ స్కూలు ఇక్కడే నెలకొల్పవడింది. మొట్టమొదటి కాలేజీ అయిన హార్వర్డు, అమెరికాలోనే మొట్టమొదటి సబ్‌వే రవాణా వ్యవస్థ మొదలయినవి ఈ నగరంలోనే ఉన్నాయి. లెక్కలేనన్ని విద్యాలయాలతో, హాస్పిటల్స్‌తో బోస్టన్ అమెరికాలోనే ప్రముఖ విద్యాకేంద్రంగా మరియు ఆరోగ్యకేంద్రంగా పేరుపొందింది. ప్రతి సంవత్సరం దాదాపు 16.3 మిలియనుల సందర్శకులు ఈ నగరానికి వస్తుంటారు.[3]
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
ఇంగ్లండ్ నుండి వలస వచ్చిన ప్యూటరిన్లు సెప్టెంబర్ 17, 1630న బోస్టన్‌ను స్థాపించారు.[2] ఆ ప్రాంతం దినదిన ప్రవర్థమానంగా అభివృద్ది చెందసాగింది. 1770లో బ్రిటీషు ప్రభుత్వం వారు వసలవాదులు నివసిస్తున్న కాలనీల పైన అధిక పన్నులు వేసి పీడించడం మొదలు పెట్టారు. అపుడే అమెరికా విప్లవానికి అంకురార్పణ జరిగింది. అది జరిగిన కొద్దిరోజులకు బోస్టన్ మరింత అభివృద్ది చెందసాగింది. సముద్రఒడ్డున ఉండడంవల్ల నౌకాయానం ద్వారా వర్తక వాణిజ్యాలలో ప్రపంచంలోనే ప్రముఖ రేవు పట్టణం అయినది. మద్యం, చేపలు, ఉప్పు, పొగాకు మొదలగునవి ఎగుమతి చేయడం మొదలుపెట్టారు. బోస్టన్‌కు మొదట వలస వచ్చినవారి భావి తరాలవారిని 'బోస్టన్ బ్రాహ్మణులు ' అని పిలవడం అపుడే మొదలయింది.
బోస్టన్ నగర అభివృద్ది తెలుసుకొన్న యురోపియన్లు ఇక్కడకు వలస రావడం మొదలుపెట్టారు. అందులో ఎక్కువమంది ఐర్లండుకు చెందినవారు. క్రమంగా జర్మనీ, ఫ్రెంచ్, రష్యా,పోలండుకు చెందివారు స్థిరపడ్డారు.
[మార్చు] భౌగోళికం
బోస్టన్ నగర వైశాల్యం 89.6 చదరపు మైళ్ళు. అందులో 48.4 చదరపు మైళ్ళు భూభాగం మరియు 41.2 చదరపు మైళ్ళు సముద్రభాగం. అమెరికాలో 500,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో శాన్ ఫ్రాన్సిస్కో మరియు వాషింగ్టన్ డి.సి. మాత్రమే బోస్టన్ కంటే చిన్నవి. ఈ నగరం సముద్ర మట్టానికి 19 అడుగుల ఎత్తులో ఉన్నది.
[మార్చు] వాతావరణం
శీతాకాలం చాలా చలిగా, మంచు కురుస్తూ, గాలులతో నిండి ఉంటుంది. జనవరి నెల మిగతా అన్ని నెలలకంటే చాలా చల్లగా ఉంటుంది. జూలై నెలలో అత్యధిక సగటు ఉష్ణోగ్రత 82 °F (28 °C) మరియు అత్యల్ప సగటు ఉష్ణోగ్రత 66 °F (18 °C) గా నమోదయింది. వేసవిలో 90 °F (32 °C) ఉండడం, శీతాకాలంలో 10 °F (−12 °C) ఉండడం సాధారణం. 1911 జూలై 4న అత్యధికంగా 104 °F (40 °C) మరియు 1934 ఫిబ్రవరి 9న అత్యల్పంగా -18 °F (-28 °C) నమోదయింది. ప్రతియేడాది సరాసరి 42 అంగుళాలు లేదా 109 సెంటీమీటర్ల మంచు కురుస్తుంది.
[మార్చు] జనాభా
2006 జనాభా లెక్కల అంచనా ప్రకారం 596,638 మంది బోస్టన్ నగరంలో నివసిస్తున్నారు. చదరపు మైలుకు 12,166 మంది ఉన్నారు. అమెరికాలో న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో మరియు చికాగో నగరాలు మాత్రమే బోస్టన్ కంటే ఎక్కువ జనసాంద్రత కలిగి ఉన్నాయి. చదరపు మైలుకు 5,203 చొప్పున మొత్తం 251,935 నివాసాలున్నాయి. చుట్టుపక్కల ఉన్న పట్టణాలనుండి వృత్తి రీత్యా, చదువుకోవడానికి, ఆరోగ్యకారణాలవల్ల వచ్చే వారివల్ల పగటిపూట బోస్టన్‌లో దాదాపు 1.2 మిలియనులు (12 లక్షలు) మంది ఉంటారు.
49% శ్వేతజాతీయులు, 25% ఆఫ్రికన్-అమెరికన్లు లేదా నల్లజాతివారు, 8% ఆసియన్-అమెరికన్లు, 1% స్థానిక అమెరికన్లు , 14% లాటిన్ అమెరికాకు చెందినవారు. 15.8% ఐరిష్ సంతతి వారు, 8.3% ఇటాలియన్లు ఉన్నారు.
ఒక్కో కుటుంబ తలసరి ఆదాయం $44,151. సగటు మనిషి ఆదాయం $23,353. 19.5% మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు.
[మార్చు] ఆర్థిక వ్యవస్థ
కాలేజీలు, విశ్వవిద్యాలయాలు బోస్టన్ ఆర్థికరంగంలో చాలా ప్రముఖపాత్ర వహిస్తాయి. ఈ విద్యాసంస్థలు కల్పిస్తున్న మానవ వనరులవల్ల ఎన్నో పరిశ్రమలు బోస్టన్ నగరంలో, చుట్టు పక్కల నెలకొల్పబడ్డాయి. 2003 లెక్కల ప్రకారం, బోస్టన్ కాలేజీల్లో, యూనివర్సిటీల్లో ఉన్న విద్యార్థులవల్ల $4.8 బిలియనుల ఆదాయం చేకూరింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నుండి అత్యధికంగా బోస్టన్‌కు ఫండ్స్ వస్తాయి.టూరిజం కూడా మరో ముఖ్యమయిన ఆదాయవనరుగా నిలుస్తున్నది. 2004లో నగరానికి వచ్చిన సందర్శకులు $7.9 బిలియన్లు ఖర్చుపెట్టారు.
ఆర్థికరంగంలో సేవలు అందించే - ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్, ఇన్స్యూరెన్స్ కంపెనీలు ఎన్నో బోస్టన్‌లో ఉన్నాయి. ఫిడిలిటీ ఇన్వెస్టిమెంట్స్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, స్టేట్ స్ట్రీట్ కార్పొరేషన్, లిబర్టీ మ్యూచువల్, జిల్లెట్, టెరాడైన్ మొదలయిన ఎన్నొ కంపెనీల ప్రధాన కేంద్రాలు బోస్టన్‌లో ఉన్నాయి.
[మార్చు] విద్య
బోస్టన్ పబ్లిక్ స్కూల్స్: అమెరికాలో మొట్టమొదటి పబ్లిక్ స్కూల్ విధానం బోస్టన్‌లో మొదలయింది. ప్రస్తుతం కిండర్‌గార్టెన్ నుండి 12వ తగరగతి వరకు దాదాపు 57,000 విద్యార్థులు ఈ సంస్థకుగల 145 స్కూళ్ళలో చదువుతున్నారు. 2002లో 82% ఉత్తీర్ణతతో ఇది అమెరికాలోఉన్న పెద్దపట్టణాల విద్యా వ్యవస్థల్లో అగ్రభాగాన నిలిచింది.
గ్రేటర్ బోస్టన్ ప్రాంతంలో ఉన్న 100 పైగా కాలేజీలు, యూనివర్సిటీల వల్ల బోస్టన్ 'యేథెన్స్ ఆఫ్ అమెరికా' అని పేరు తెచ్చుకుంది. బోస్టన్, కేంబ్రిడ్జ్ లో ఉన్న కాలేజీల్లో దాదాపు 250,000 విద్యార్థులు ఉన్నారు.
బోస్టన్ అంటే ప్రముఖంగా చెప్పుకోవలసిన విద్యాలయాలు రెండు ఉన్నాయి.
1) హార్వర్డ్ యూనివర్సిటీ: 1636లో స్థాపింపబడిన హార్వర్డ్ అమెరికాలోనే మొట్టమొదటి ఉన్నతవిద్యాలయం. మొదట 'న్యూ కాలేజ్' అని పేరు పెట్టబడింది. 1639 లో జాన్ హార్వర్డ్ అనే వ్యక్తి తనదగ్గర ఉన్న 400 పుస్తకాలను, తన ఆస్థిలో సగభాగాన్ని విరాళం ఇచ్చినపుడు 'హార్వర్డ్ యూనివర్సిటీ'గా పేరు మార్చబడింది.
15 మిలియనుల (1.5 కోటి) కంటే ఎక్కువ పుస్తకాలతో హార్వర్డ్ లైబ్రరీ ప్రపంచంలోనే అతి పెద్ద విద్యాలయ లైబ్రరీగా నిలిచింది. ప్రస్తుతం దాదాపు 2,400 మంది ప్రొఫెసర్లు, 6,715 అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులు, 12,424 గ్రాడ్యుయేట్ విద్యార్థులు హార్వర్డులో ఉన్నారు.
2) మస్సాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి (MIT): 1861లో అమెరికా పారిశ్రామీకరణలో భాగంగా ఒక ప్రైవేటు యూనివర్సిటీగా MIT నెలకొల్పబడింది. రెండవ ప్రపంచ యుద్ద కాలంలో MITలో ఉన్న శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసి కంప్యూటర్, రాడార్ మొదలయిన అంశాల గురించి కొత్త విషయాలు కనుగొన్నారు.
చార్లెస్ నది పక్కన దాదాపు 168 ఎకరాల్లో ఉన్న కేంబ్రిడ్జ్ క్యాంపస్ MIT ప్రధాన విభాగం.ఇది కాక మరో ఐదు విభాగాలు ఉన్నాయి. ప్రతి యేడాది 4,000 అండర్‌గ్రాడ్యుయేట్, 6,000 గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ప్రవేశం లభిస్తుంది. ప్రతి యేడాది అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులు $33,600 , గ్రాడ్యుయేట్ విద్యార్థులు $33,600 ఫీజు చెల్లించాలి.
[మార్చు] సంస్కృతి
ఐర్లండునుండి వచ్చినవారు ఎక్కువ ఉండడం వల్ల వారి ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది. బోస్టన్‌లో ఉన్న విద్యావంతులు మరియు మేధావుల వల్ల ఈ ప్రాంతాన్ని సాంస్కృతికంగా ఎంతో గొప్పదానిగా పరిగణిస్తారు. ఒక మనిషికి ఉన్న డబ్బుకంటే విషయ పరిజ్ఞానానికి ప్రాధాన్యత ఇస్తారు. మార్క్ ట్వేయిన్ ఇలా అన్నాడు: న్యూయార్కులో 'నీకు ఎంత డబ్బు ఉంది ' అంటారు. ఫిలడెల్ఫియాలో 'నీ తల్లిదండ్రులు ఎవరు ' అంటారు. బోస్టన్‌లో ' నీకు ఏమేమి తెలుసు ' అంటారు.
నాటకరంగానికి బోస్టన్ పెట్టింది పేరు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బోస్టన్ ఒపేరా హౌస్‌లో ఎప్పుడూ నాటక ప్రదర్శనలు జరుగుతుంటాయి. రోడ్ల పక్కన, పార్కుల్లో కూడా చిన్న చిన్న నాటక ప్రదర్శనలు జరుగుతుంటాయి.అమెరికాలోనే అతి పెద్ద మ్యూజియంలలో ఒకటయిన మ్యూజియం ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ 1870లో నెలకొల్పబడింది. ఇందులో ఈజిప్టు రాజులకు సంభంధించిన విగ్రహాలు, ఆభరణాలు ఉన్నాయి.
బోస్టన్ మారథాన్: ఆధునిక ప్రపంచంలో చాలా పాతది మరియు పేరు పొందినది అయిన మారథాన్ ఇక్కడ ప్రతి యేడాది ఏప్రిల్ నెల మూడవ సోమవారం జరుగుతుంది. ప్రంపంచదేశాల ప్రముఖ ఆటగాళ్ళు, వేల సంఖ్యలో బోస్టన్ నగరవాసులు ఇందులో పాల్గొంటారు. 1996లో జరిగిన 100వ రేసులో దాదాపు 38,000 మంది పాల్గొన్నారు. ఇందులో పాల్గొనేవారు 26.22 మైళ్ళు (42.197 కిమీ) పరుగెత్తాలి.
[మార్చు] క్రీడలు
బోస్టన్ నగరం క్రీడలకు నిలయంగా పేరుపొందింది. క్రీడలు ఇక్కడి ప్రజల జీవనంలో భాగముగా చెప్పుకుంటారు.
బోస్టన్ రెడ్ సాక్స్: - అమెరికాలో మేజర్ లీగ్ బేస్‌బాల్ మొదలయినప్పుడు ఇది స్థాపింపబడింది. 1903లో మొట్టమొదటి వరల్డ్ సిరీస్ బోస్టన్‌లో జరిగింది. ఇప్పటి వరకు బోస్టన్ రెడ్ సాక్స్ టీం 7సార్లు ఛాంపియన్‌షిప్ సాధించింది.
న్యూ ఇంగ్లండ్ పేట్రియాట్స్: ఇది ఫుట్‌బాల్ (సాకర్ కాదు!) టీం. 1960లో బోస్టన్ పేట్రియాట్స్ గా మొదలయి 1971 లో న్యూ ఇంగ్లండ్ పేట్రియాట్స్ గా మారింది. అభిమానులు 'ప్యాట్స్ ' అని పిలుచుకొనే ఈ టీం 2001, 2003 మరియు 2004లలో ఛాంపియన్‌షిప్ సాధించింది.
బోస్టన్ సెల్టిక్స్: 1946లో బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా మొదలయినపుడు ఈ టీం నెలకొల్పబడింది. బాస్కెట్‌బాల్ చరిత్రలో మరే టీం సాధించని విధంగా 16 సార్లు ఛాంపియన్‌షిప్ సాధించింది.
[మార్చు] రవాణా వ్యవస్థ
17వ శతాబ్దపు గుర్రపుబండీల మార్గాల కోసం వేసిన రహదారులు ఇప్పటికీ బోస్టన్‌లో కనిపిస్తాయి. అందుకే అమెరికాలోని మిగతా నగరాల డౌన్‌టౌన్‌ల మాదిరి ఒక క్రమంలో కాకుండా కాస్త గందరగోళంగా ఉంటాయి. కొత్తగా రోడ్లు వేస్తున్నప్పటికీ, అప్పటికే శతాబ్దాల తరబడి ఉన్న భవనాలు, కట్టడాలవల్ల సరి అయిన పద్దతిలో వేయలేకపోతున్నారు. మిగతా నగరాలతో పోల్చినపుడు, బోస్టన్‌లో చాలమంది సైకిళ్ళను ఉపయోగిస్తున్నా, సైకిళ్ళపై ప్రయాణం చేయడానికి ఉన్న వసతులు చాలా తక్కువ. ఈ విషయంలో బోస్టన్ ఒక చెత్త వ్యవస్థగా పేరుతెచ్చుకుంది.
బోస్టన్ నగర ప్రయాణ సంస్థలన్నింటినీ కలిపి MBTA నిర్వహిస్తుంది. అమెరికాలోనే మొట్టమొదటిదయిన భూగర్భ ప్రయాణ వ్యవస్థ ఇందులో భాగం. ప్రతిరోజూ దాదాపు 1.1 మిలియనుల (11 లక్షల) ప్రయాణికులు రైళ్ళలో, బస్సుల్లో, సబ్‌వేలో, బోట్లలో ప్రయాణిస్తుంటారు. అమెరికాలోనే అత్యధికంగా బోస్టన్ వాసులు 13% కాలినడకన రాకపోకలను సాగిస్తారు.
బిగ్ డిగ్: రోజు రోజుకు కిక్కిరిసిపోతున్న బోస్టన్‌లో నగరం కింద టన్నల్ ద్వారా రాకపోకలను కొనసాగించడానికి ఈ ప్రాజెక్టును 1982లో మొదలుపెట్టారు. 2.8 బిలయన్ డాలర్ల అంచనాతో మొదలయిన ఈ ప్రాజెక్టు 2007 డిసెంబరు నాటికి 14.6 బిలియన్ డాలర్ల వ్యయంతో ముగిసింది. వందల సంవత్సరాలుగా ఉన్న భవనాల కింద, నదీ జలాల మధ్యలో 3.5 మైళ్ళు (5.6 కిలోమీటర్లు) తొలచి అందులో రోడ్లు వేయడం ప్రపంచ నిర్మాణాల్లో ప్రముఖంగా నిలిచిపోయింది.
[మార్చు] మూలాలు
- ↑ Steinbicker, Earl (2000). 50 one day adventures in Massachusetts, Rhode Island, Connecticut, Vermont, New Hampshire, and Maine. Hastingshouse/Daytrips Publishers, 7. ISBN 0803820089.
- ↑ 2.0 2.1 Banner, David (2007). BOSTON HISTORY—The History of Boston, Massachusetts. SearchBoston.com. తీసుకొన్న తేదీ: 2007-04-28.
- ↑ Boston: Economy. Thomson Gale (Thomson Corporation) (2006). తీసుకొన్న తేదీ: 2007-04-28.