అడిదం సూరకవి
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
తెలుగు సాహిత్య చరిత్రలో చెప్పకోదగ్గ కవుల్లో 18వ శతాబ్దంలో జీవించిన అడిదము సూరకవి (Adidam Surakavi) ఒకరు. ఇతడు చంద్రాలోకం, ఆంధ్రనామశేషం వంటి రచనలు చేశాడు. పైడిపాటి లక్ష్మణకవి తో కలసి ఆంధ్రనామ సంగ్రహం రచించాడు.
[మార్చు] అడిదము వారి వంశచరిత్ర
ఆంధ్రదేశంలో కవితా వృత్తిచే పేరు పొందిన నియోగి బ్రాహ్మణ కుటుంబాలలో అడిదము వారు ఒకరు. ఈ వంశీయులు కవిత చెప్పడంలోనే గాక కత్తి తిప్పడంలోనూ సమర్ధులు. 'వసిష్ట' గోత్రులు శివశ్యామలాదేవతోపాసకులు. ఈ వంశీయులు 23 తరాలనుండి కవితా వృత్తిచే జీవించారని, 14 తరాలనుండి వీరికి రాజాస్థానం లభించిందని తెలుస్తుంది. ఈ వంశీయులలో మొదటి వారిని గురించిన సమాచారం దొరకడం లేదు. ఈ వంశీయులు రాజాస్థానం పొందిన దగ్గర నుండి సమాచారం దొరుకుతుంది.
- గృహనామం
కళింగదేశం లోని సుప్రసిద్ధ విద్వత్కవి వంశాలలో ఒకటి అడిదం వారి వంశం. మొదట మోదుకూరి, తరవాత గంధవారణం అనే ఇంటిపేర్లు గల ఈ వంశం వారికి వీరి పూర్వీకుడైన నీలాద్రి కవి రణరంగ వీరుడై ఒక అడిదాన్ని (కత్తిని) కానుక గా పొందిన నాటి నుండి అడిదం వారని ప్రసిద్ధి వచ్చింది. గోదావరి మండలం మోదుకూరు కాపురంవచ్చిన వీరికి మోదుకూరు ఇంటి పేరు అయింది. తరువాత వీరి ఇంటి పేరు 'గంధవారణం'అయింది. ఈ కుటుంబంలో ప్రసిద్ధ కవులు తమ గంధాలను ఏనుగుల (?)
[మార్చు] ఉదాహరణలు
లోకంలో తిట్టుకవిగానూ, లోకజ్ఞ్డుడుగానే విఖ్యాతుడైనా, నిజానికి 'మృడ పద పంకజ రిరంసు మృదు మానసు'డై రామలింగేశ శతకం వంటి పదహారణాల చాటుత్వం గల చక్కని శతకం చెప్పిన ఆడిదం సూరకవి ఆ నీలాద్రి కవికి 9 వ తరం వాడు. తనను గూర్చిన వివరాలను సంభాషణాత్మక చాటువులో ఇలా స్వయంగా సూరకవి చెప్పుకున్నాడు--
కం. "ఊరెయ్యది?" "చీపురుపలి",
"పేరో?" "సూరకవి" ; "ఇంటిపే?" "రడిదమువార్" ;
"మీ రాజు?" "విజయరామ మ
హా రా": "జత డేమి సరసుడా ?" "భోజు డయా!"
ఈ పద్యాన్నిబట్టి ఈ కవి విజయనగర ప్రభువు శ్రీ పూసపాటి విజయరామరాజు ఆస్థానానికి చెందిన వాడని తెలుస్తూంది. తన ప్రభువును స్తుతిస్తూ పెద్దపురం ఆస్థానంలో ఈ కవి చెప్పిన సుప్రసిద్ధ చాటువు -
ఉ. రాజు కళంకమూర్తి; రతిరాజు శరీర విహీను ; డంబికా
రాజు దింబరుడు; మృగరాజు గుహాంతర సీమవర్తి ; వి
భ్రాజిత పూసపా డ్విజయరామ నృపాలుడు రాజు కాక ఈ
రాజులు రాజులా పెను తరాజులు కాక ధరాతలంబునన్.
సభలో ఉన్న రాజు లంతా తమనే తరాజు లంటున్నా డని రోషం తెచ్చుకోగా, చమత్కారంగా ఈ కవి తాను పద్యంలో పేర్కొన్న రాజు (చంద్రుడు), రతిరాజు (మన్మధుడు), మొదలైన రాజుల్నే తాను తరాజు లన్నా నని చెప్పి శాంత పరిచాడట. సూరకవికి కనకాభిషేకం చేయించిన విలువైన చాటు విది.
'పొణుగుపాటి వేంకట మంత్రీ!' అనే మకుటం తో సూరకవి చెప్పిన 39 కందాలు కళింగ దేశ ప్రాంతాల్లో వ్యాప్తిలో ఉన్నాయి. ఈ వేంకట మంత్రి (1720-1780) శృంగవరపుకోట జమీందారు శ్రీ ముఖీ కాశీపతిరావుగారి వద్ద దివానట! ఈయన మహాదాత, కవి, పండిత పక్షపాతి. సూరకవి ఈ మంత్రిగారి ఇంట ప్రతి యేడూ మూడు నాలుగు మాసాలపాటు గడుపుతూ ఉండే వా డని 'ఆడిదం సూరకవి జీవితం' (పుట 80) చెబుతూంది.
కం. వెన్నెల వలె కర్పూరపు
దిన్నెల వలె నీదు కీర్తి దిగ్దేశములన్
మిన్నంది వన్నె కెక్కెను
విన్నావా ? పొణుగుపాటి వేంకట మంత్రీ !
కం. చుక్కల వలె కర్పూరపు
ముక్కల వలె నీదు కీర్తి ముల్లోకములన్
క్రిక్కిరిసి పిక్కటిల్లెను
వెక్కసముగ పొణ్గుపాటి వెంకట మంత్రీ !
కం. సన తేనియ గైకొను భృం
గ నిరూఢిని దాత మనసు కందక యుండన్
కొనవలె యాచకు డర్ధము
విను మవహిత ! పొణుగుపాటి వేంకట మంత్రీ !
కం. పొగ త్రాగనట్టి నోరును
పొగడంగా బడయనట్టి భూపతి బ్రదుకున్
మగడొల్లని సతి బ్రదుకును
వెగటు సుమీ పొణుగుపాటి వేంకట మంత్రీ !
కందానికి కవి చౌడప్ప అలవరించిన తేటతనానికి మెరుగులు పెట్టదం సూర కవి చెప్పిన ఈ కందాల్లో కనిపిస్తుంది. 'చుక్కల వలె' అనే పద్యం 'కన్యాశుల్కం' (పుట 82) లో గిరీశం ఉపన్యాసాలలో చోటు చేసుకునేటంత ప్రసిద్ధి పొందింది. పొణుగుపాటి వేంకట మంత్రి బ్రాహ్మణ సమారాధానలకు పేరు మూసినవాడు. ఒకనాటి సమారాధన వైభవం చూసి, సూరకవి 'ఒక్క సముద్రము దక్కగ' అనే పద్యం చెప్పాడత. ఒక ఉప్పు సముద్రం తప్ప, క్షీర, దధి, ఘృతాది ఇతర ఆరు సముద్రాలూ ఆ సమారాధనలో వెల్లివిరిసినాయట. ఈ పద్యం విని సమారాధనలో మదిచార పోసి పట్టుకోక ధరించి విప్రులకి నెయ్యి వడ్డిస్తున్న వేంకటమంత్రిగారి సోదరి బసవగారి వరస అయిన సూరకవితో 'స్వయంపాకులైన బావగారి కోసాం ఆ సముద్రం మా అన్నయ్య విడిచి పెట్టాడు లెండి' అని ముసి ముసి నవ్వులు నవ్వుతూ విసరిన చెణుకుకి సూరకవి అంతటి వాదే నిరుత్తరు డయా డని ఐతిహాస్యం.
నియోగి, వైదీకి మనస్పర్ధలు సూరకవి నాదే తారస్థాయి అందుకున్నట్లు 'చెన్నగు నియోగి కవనపు' లాంటి పద్యాలే గాక, విద్వత్కవి, గొప్ప తార్కికుడు.వైదికుడు అయిన రేకపల్లి సోమప్పతో సూరకవి వివాదం వొంటివి కూడా స్పష్టం చేస్తున్నాయి. ఆ సోమప్పను సూరకవి ఇలా పరిహసిస్తాడు -
కం. ఏమేమో శాస్త్రంబులు
తా మిక్కిలి సతికె నంట తద్దయు కవితా
సామర్ధ్య మెరుగ నేరని
సోముని జృంభణము కలదె సూరుని ఎదుటన్ ?
కం. తెలుగుం గబ్బపు రీతులు
కల నెరుగని శుష్క తర్క కర్కశ మతికిన్
తెలిసె నొకయించు కించుక
వెలిపలి గౌతన్న కృప కవిత్వపు జాడల్.
సూరకవి తిట్టుకవిగా ప్రసిద్ధుడవడానికి ఈయన శాపానుగ్రహ సమర్ధు డని చా అనేక కధలు ప్రచారంలో ఉన్నయి. తన తిట్టు పటిమను గూర్చి సూరకవే ఇలా చెప్పుకుంటాడు -
చం. గడియకు నూరు పద్యములు గంటము లేక రచింతు, తిట్టగా
దొడగితినా పఠీలు మని తూలి పడున్ కుల శైల రాజముల్
విడువ కను గ్రహించి నిరుపేద ధనాధిపు తుల్యు చేతు నే
నడిదము వాడ సూరన సమాఖ్యుడ నా కొకరుండు సాటియే ?
సూరకవి వివిధ రాజాస్థానాలు సందర్శించినట్టూ, సర్వత్రా విజయలక్ష్మిని చేపట్టినట్టూ ఆయన జీవిత చరిత్ర చెపుతూంది. బొబ్బిలి సంస్థానం దర్శించినప్పుడు ఈయన పూరించినట్లు చెప్పబడుతున్న ఒక సమస్య;
ఉ. సౌరతర ప్రబంధము లసంఖ్యముగా నొనరించు నట్టి ఈ
సూర కవీంద్రునిం జునిగి చూత మటంచును మాటి మాటికిన్
ఈరస మెత్తి దుష్కృతుల నిచ్చిన నారల నోరు మొత్తుడీ
మీరును మీరు మీరు మరి మీరును మీరును మీర లందరున్.
ఒకసారి సూరకవి భార్య "అందరి మీదా మీరు పద్యాలు చెబుతారు, మన బాచన్నమీద కూడా ఒక పద్యం చెప్పకూడదూ?" అందిట నిష్టూరంగా. వెంటనే 'తన,పర' అనే బేధం లేని సూర కవి ఆ ఎత్తు పళ్ళ సుందరాంగుడి మీద ఈ హాస్య చాటువు చెప్పాడు-
కం. బాచా బూచులలోపల
బాచన్నే పెద్ద బూచి పళ్ళున్ తానున్
బూచంటె రాత్రి వెరతురు
బాచన్నను చూసి పట్టపగలే వెరతుర్.
సూర కవి పద్యాల్లో ఎంతటి మహారాజునైనా 'నువ్వు', ను'వ్వని ఏకవచన ప్రయోగం చేస్తూండడాన్ని ఆక్షేపించిన ఒక సేతారామరాజుగారికి సూరకవి ఇలా జవాబు చెబుతాడు. పిల్లల్నీ, రతి సమయంలోనూ, కవిత్వంలోనూ, యుద్ధంలోనూ ఎవరినైనా 'ఏరా' అనవచ్చునట !
కం. చిన్నప్పుడు, రతికేళిని
ఉన్నప్పుడు, కవితలోన, యుద్ధములోనన్
వన్నె సుమీ 'రా' కొట్టుట
చెన్నగు నో పూసపాటి సీతారామా !
[మార్చు] మూలాలు
- తెలుగు చాటువు పుట్టుపూర్వోత్తరాలు. రచన: బాలాంత్రపు నళినీకాంతరావు.