తులసీదళం
వికీపీడియా నుండి
తులసి దళం అత్యంత ప్రజాధరణ పొందిన యండమూరి వీరేంద్రనాథ్ నవల. ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్‌గా వచ్చింది. తరువాత సినిమాగా కూడా నిర్మించబడింది. ఈ నవల విడుదలాయిన సమయం నుండి అనేక సార్లు ప్రచురితమై యండమూరి కొన్ని రచనలలా అత్యదికంగా అమ్మబడినది. కన్నడంలో కూడా ఇతోధికంగా జనాదరణ పొందింది.
తులసి అనే పాప ఒక ఆస్తిపరుని కుమార్తె. అతనిపై కక్ష కట్టిన కొందరి కుతంత్రం వల్ల ఆ బిడ్డపై కాష్మోరా అనే దుష్ట శక్తి ప్రయోగమౌతుంది. ఇందులో కాద్రా అనే మాంత్రికుడి పట్టుదల ఉంది. అందువల్ల తీవ్రమైన అనారోగ్యానికి గురైన ఆ పాప రోజురోజుకూ మరణానికి దగ్గరవుతుంది. ఆ బిడ్డను రక్షించుకొనే ప్రయత్నంలో నలుగురి ప్రయత్నం ఈ కధలో చాలా పట్టుగా చెప్పబడింది. ఇస్మాయిల్ అనే సాధకుడు చేతబడికి విరుగుబడి చేయిస్తాడు. ఆధునిక దృక్పథం కల తులసి తండ్రి చేతబడిని నమ్మి అందుకు విరుగుడు చేయించడానికి తంటాలు పడుతాడు. వారి శ్రేయోభిలాషి అబ్రకదబ్ర (అబ్బూరి కేదారేశ్వరరావు) అతనికి సాయపడతాడు. సంప్రదాయాలను నమ్మే తులసి తల్లి క్రమంగా వైజ్ఞానిక దృక్పధంలో ఆలోచించసాగింది.
పాఠకులు ఎంతో ఆసక్తిగా వచ్చేవారం కోసం ఎదురు చూసిన ధారావాహికలలో ఇది ఒకటి. రచయిత వైజ్ఞానిక విశ్లేషణను, తాంత్రిక విధానాలను సమాంతరంగా చూపడానికి ప్రయత్నించాడు గాని చివరకు ఎటూ తేల్చకుండా నిర్ణయాన్ని వదిలేశాడు. 'కాష్మోరా' అనే మాట ఆంధ్రదేశంలో పరిచయం అయ్యి అనేక వ్యంగ్య సందర్భాలలో వాడబడింది. ఈ నవలకు పొడిగింపుగా తరువాత ఇదే రచయిత 'తులసి', 'కాష్మోరా' అనే నవలలు వ్రాశాడు.
ఈ నవలను, దానిని అనుకరిస్తూ వచ్చిన అనేక రచనలను విమర్శకులు "క్షుద్ర సాహిత్యం" అని తెగనాడారు. వ్యంగ్యంగా "వేపమండలు" అనే నవల కూడా వచ్చింది.