కె.కామరాజ్
వికీపీడియా నుండి
జననం: | జూలై 15 1903 విరుధునగర్, తమిళనాడు |
---|---|
మరణం: | అక్టోబర్ 2 1975 (వయసు: 72) చెన్నై, తమిళనాడు |
వృత్తి: | రాజకీయుడు, సమాజ సేవకుడు |
కె.కామరాజ్ గా ప్రసిద్ధి చెందిన కుమారస్వామి కామరాజ్ (Kamaraj Kumaraswami) (తమిళం : காமராஜ்) (జూలై 15 1903 – అక్టోబర్ 2 1975) తమిళనాడుకు చెందిన భారత రాజకీయనాయకుడు. భారత రత్న పురస్కార గ్రహీత. ఇందిరా గాంధీని ప్రధానమంత్రి చెయ్యటంలో ఈయన పోషించిన పాత్రకు గాను భారత రాజకీయాలలో కింగ్‌మేకర్‌గా పేరొందాడు.
భారత స్వాతంత్ర్యోద్యమములో పాల్గొన్న కామరాజ్, భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు అత్యంత సన్నిహితుడు. నెహ్రూ మరణము తర్వాత 1964లో లాల్ బహదూర్ శాస్త్రిని, ఆయన తర్వాత 1966లో ఇందిరా గాంధీని ప్రధాని చేయటంలో కామరాజ్ ప్రధానపాత్ర పోషించాడు. ఈయన అనుయాయులు అభిమానముతో ఈయన్ను దక్షిణ గాంధీ, నల్ల గాంధీ అని పిలిచేవారు. ఈయన సొంత రాష్ట్రమైన తమిళనాడులో, 1957లో కామరాజ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత విద్యను, పాఠశాలలో ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టి అనేక లక్షలమంది గ్రామీణ పేదప్రజలకు విద్యావకాశము కల్పించినందుకు నేటికీ ప్రశంసలందుకున్నాడు. 1976లో ఈయన మరణాంతరము భారత అత్యున్నత పౌరపురస్కారము భారతరత్నను అందుకున్నాడు.